ప్రపంచకప్‌: కివీస్‌ లక్ష్యం 242

19 Jun, 2019 20:20 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ : ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 242 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. బుధవారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు అదే నిలకడలేమి ప్రదర్శనను కనబర్చింది. ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉండటంతో టాస్‌ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 49 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో హషీమ్‌ ఆమ్లా(55; 83 బంతుల్లో 4ఫోర్లు), డస్సెన్‌(67; 64 బంతుల్లో 2ఫోర్లు, 3 సిక్సర్లు)మినహా ఎవరూ అంతగా రాణించలేకపోయారు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.  కివీస్‌ బౌలర్లలో ఫెర్గుసన్‌ మూడు వికెట్లతో రెచ్చిపోగా.. బౌల్ట్‌, గ్రాండ్‌హోమ్‌, సాంట్నర్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు.

టాస్‌ గెలిచిన కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ డికాక్‌(5)ను ట్రెంట్‌ బౌల్ట్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో మరో ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లాతో కలిసి సారథి డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం డుప్లెసిస్‌(23)ను ఫెర్గుసన్‌ పెవిలియన్‌కు పంపించాడు. ఓ వైపు వికెట్లు పెడుతున్నా మరో వైపు ఆమ్లా నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అర్దసెంచరీ పూర్తి చేసిన అనంతరం ఆమ్లా కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. అయితే చివరల్లో డస్సెన్‌ ఒంటరి పోరాటం చేయడంతో సఫారీ జట్టు కనీసం పోరాడే స్కోర్‌ను నమోదు చేసింది. 

కివీస్‌ కట్టుదిట్టంగా..
దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో కివీస్‌ బౌలర్లు విజయవంతం అయ్యారు. క్రమంగా వికెట్లు తీస్తూ సఫారీ జట్టుపై ఒత్తిడి పెంచారు. కివీస్‌ బౌలింగ్‌లో పరుగులు రాబట్టడానికి సఫారీ బ్యాట్స్‌మెన్‌ నానాతంటాలు పడ్డారు. ఇంగ్లండ్‌ పిచ్‌లపై నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్‌ చేసి అతి తక్కువ స్కోర్‌ నమోదు కావడం ఈ మధ్య కాలంలో ఇదే కావడం గమనార్హం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు