లంక గెలిచే‌‌.. ఆనందం విరిసె

1 Jul, 2019 23:55 IST|Sakshi

గెలిచి పరువు నిలుపుకున్న లంక

23 పరుగుల తేడాతో విజయం

నికోలస్‌ ఒంటరి పోరాటం వృథా

చెస్టర్‌ లీ స్ట్రీట్‌ : ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో శ్రీలంక అదరగొట్టింది. ఈ టోర్నీలో తొలి సారి బ్యాటింగ్‌లో అదరగొట్టిన లంకేయులు ఘన విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికే సెమీస్‌ రేస్‌ నుంచి తప్పుకున్న లంకేయులకు ఈ విజయం ఆనందం కలిగించేదే. సోమవారం రివర్‌సైడ్‌ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో కరేబియన్‌ జట్టుపై 23 పరుగుల తేడాతో లంక జయభేరి మోగించింది. సింహళీయులు నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులకే పరిమితమైంది. 

విండీస్‌ ఆటగాళ్లలో నికోలస్‌ పూరన్‌(118; 103 బంతుల్లో 11ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో రాణించినప్పటికీ కీలక సమయంలో అవుటై తీవ్రంగా నిరాశపరిచాడు. పూరన్‌కు తోడుగా ఫాబియన్‌ అలెన్‌(51) అర్దసెంచరీతో ఆకట్టుకున్నాడు. లంక బౌలర్లలో మలింగ మూడు వికెట్లతో రాణించాడ. తన శతకంతో లంక భారీ స్కోర్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన అవిష్క ఫెర్నాండోకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

నికోలస్‌ ఒక్కడే..
లక్ష్యఛేదనలో విండీస్‌ తడబడింది. విజయానికి అవసరమయ్యే భారీ భాగస్వామ్యాలను నమోదు చేయడంలో విండీస్‌ టాపార్డర్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ విఫలమయ్యారు. దీంతో 199 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి భారీ ఓటమికి విండీస్‌ దగ్గర్లో నిలిచింది. అయితే నికోలస్‌ పూరన్‌- అలెన్‌ జోడి ఎనిమిదో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో కరేబియన్‌ జట్టు మళ్లీ రేసులోకి వచ్చింది. ఈ క్రమంలోనే అర్దసెంచరీ సాధించిన అనంతరం అనవసరంగా అలెన్‌ రనౌట్‌ అవ్వడం, శతకం పూర్తయిన వెంటనే నికోలస్‌ వెనుదిరగడంతో విండీస్‌ ఓటమి ఖాయం అయింది.
    
అంతకుముందు శ్రీలంక ఆటగాళ్లు అవిష్క ఫెర్నాండో (104;103 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి తోడు కుశాల్‌ పెరీరా (64; 51 బంతుల్లో 8 ఫోర్లు), తిరుమన్నే(45 నాటౌట్‌; 33 బంతుల్లో 4 ఫోర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్‌ బౌలర్లలో హోల్డర్‌ రెండు వికెట్లు సాధించగా, కాట్రెల్, థామస్, ఫాబియన్‌ అలెన్‌ తలో వికెట్‌ తీశారు. 

తలో చేయి వేశారు.. 
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం లభించింది. ఓపెనర్లు దిముత్‌ కరుణరత్నే(32: 48 బంతుల్లో 4 ఫోర్లు), కుశాల్‌ పెరీరా జోడీ తొలి వికెట్‌కు 93 పరుగులు జతచేసింది. ఈ తరుణంలో వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటయ్యాక అవిష్క, కుశాల్‌ మెండిస్‌(39: 41 బంతుల్లో 4 ఫోర్లు) మరో ఉపయుక్త భాగస్వామ్యం(85) ఏర్పరిచింది. దీంతో లంక భారీ స్కోరు దిశగా పయనిం చింది. ఆ తర్వాత ఏంజెలో మాథ్యూస్‌(26)తో కలసి ఫెర్నాండో మరో 55 పరుగులు జత చేశాడు. ఉదాన(3) నిరాశపరిచాడు. చివర్లో తిరిమన్నే స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ సమయోచితంగా ఆడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో స్కోరు 300 దాటింది.

మరిన్ని వార్తలు