భారత్‌ అజేయభేరి

22 Jun, 2019 23:30 IST|Sakshi

హ్యాట్రిక్‌తో చెలరేగిన పేసర్‌ షమీ

రాణించిన కోహ్లి, జాదవ్‌

అఫ్గాన్‌పై 11 పరుగులతో విజయం

కడదాకా పోరాడిన నబీ

తదుపరి మ్యాచ్‌ గురువారం వెస్టిండీస్‌తో

దక్షిణాఫ్రికా మెడలు వంచాం... ఆస్ట్రేలియాపై అదరగొట్టేశాం... పాకిస్తాన్‌ పని పట్టేశాం... అఫ్గానిస్తాన్‌ ఎంతలే అనుకుంటే... ఆ జట్టే మనకు చుక్కలు చూపింది.  400 కొడదామనో, సెంచరీలు, అర్ధ సెంచరీలు బాదుకుందామనో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను... నెమ్మదిగా ఉన్న పిచ్‌పై స్పిన్‌తో కళ్లెం వేసింది. ఛేదనలో బలమైన బౌలింగ్‌ను తట్టుకుంటూ కోహ్లి సేనకు ఈ ప్రపంచ కప్‌లో తొలి ఓటమి రుచి చూపించేలా కనిపించింది. కానీ, బుమ్రా, షమీ పేస్‌తో పడగొట్టడంతో పోరాడి ఓడామన్న సంతృప్తి మిగుల్చుకుంది.

సౌతాంప్టన్‌: కూనే అనుకుంటే అఫ్గానిస్తాన్‌ కొమ్ములు విసిరింది. ప్రపంచ కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత్‌ను ఠారెత్తించింది. అయితే, ఒత్తిడిలో తలొంచింది. పరిస్థితులను అనుకూలంగా మల్చుకున్న కోహ్లి సేన ప్రత్యర్థి నుంచి విజయాన్ని లాక్కుంది.  రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (63 బంతుల్లో 67; 5 ఫోర్లు), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌ (68 బంతుల్లో 52; 3 ఫోర్లు, సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు.

ఆఫ్‌ స్పిన్నర్‌ ముజీబుర్‌ రహ్మాన్‌ (1/26) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. బౌలింగ్‌లో మెరిసిన ఆల్‌రౌండర్లు మొహమ్మద్‌ నబీ (55 బంతుల్లో 52; 4 ఫోర్లు, సిక్స్, 2/33), రహ్మత్‌ షా (63 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1/22)లు ఛేదనలోనూ అఫ్గాన్‌ను గెలుపు దిశగా నడిపించారు. పేసర్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జస్‌ప్రీత్‌ బుమ్రా (2/39), మొహమ్మద్‌ షమీ (4/40) కీలక సమయాల్లో భాగస్వామ్యాలను విడగొట్టడంతో ప్రత్యర్థి 49.5 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌటైంది. భారత్‌ తదుపరి మ్యాచ్‌ను గురువారం మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో ఆడనుంది.

ఎంతో అనుకుంటే ఇంతేనా?
పిచ్‌ పరిస్థితిని పసిగట్టాడో ఏమో కాని అఫ్గాన్‌ కెప్టెన్‌ నైబ్‌... ముజీబ్‌తో బౌలింగ్‌ దాడిని ప్రారంభించి ఆశ్చర్యపర్చాడు. దీనికి తగ్గట్లే అతడు అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (1)ను తన రెండో ఓవర్లోనే బౌల్డ్‌ చేసి కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టాడు. మరో ఎండ్‌లో అఫ్తాబ్‌ అలమ్‌ బౌలింగ్‌లో రెండేసి ఫోర్లు కొట్టి కేఎల్‌ రాహుల్‌ (53 బంతుల్లో 30; 2 ఫోర్లు), కోహ్లి జోరు పెంచేందుకు ప్రయత్నించినా ముజీబ్‌ మాత్రం వారికి అవకాశం ఇవ్వలేదు. అతడి తొలి స్పెల్‌ (6 ఓవర్లు)లో 18 పరుగులే రావడం గమనార్హం. ఇబ్బందిగా నెట్టుకొచ్చిన రాహుల్‌... నబీ ఓవర్లో రివర్స్‌ స్వీప్‌నకు యత్నించి వికెట్‌ సమర్పించుకున్నాడు. సాధికారికంగా ఆడిన కోహ్లి 48 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
 
కెప్టెన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించిన విజయ్‌ శంకర్‌ (41 బంతుల్లో 29; 2 ఫోర్లు) పరిస్థితి చక్కబడుతుండగా రహ్మత్‌ షా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అదనపు బౌన్స్‌ అయిన నబీ బంతిని కట్‌ చేయిబోయి కోహ్లి ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 30.3 ఓవర్లలో 135/4. ఈ దశలో జాదవ్, ధోని (52 బంతుల్లో 28; 3 ఫోర్లు) ద్వయాన్ని ప్రత్యర్థి స్పిన్నర్లు కట్టిపడేశారు. 6 ఓవర్లపైగా వీరు బౌండరీనే కొట్టలేకపోయారు. మూడో బ్యాట్‌ మార్చాక ధోని ఓ ఫోర్‌ సాధించగలిగాడు. ఓవర్లు తరిగిపోతుండటంతో స్కోరు పెంచే ఉద్దేశంతో రషీద్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి ధోని స్టంపౌటయ్యాడు. దీంతో 57 పరుగుల ఐదో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. హార్దిక్‌ పాండ్యా (7) ఈసారి బ్యాట్‌ ఝళిపించలేకపోయాడు. చివరి ఓవర్లో అర్ధసెంచరీ (66 బంతుల్లో) పూర్తి చేసుకున్న జాదవ్, షమీ (1)లను నైబ్‌ పెవిలియన్‌ చేర్చాడు.

షమీ, నబీ

కలవరపెట్టినా గెలవలేకపోయారు...
ఓపిక, తెలివిగా ఆడితే ఛేదించదగిన లక్ష్యంతో దిగిన అఫ్గాన్‌ను హజ్రతుల్లా  (10)ను బౌల్డ్‌ చేయడం ద్వారా షమీ తొలి దెబ్బకొట్టాడు. రెండో వికెట్‌కు కెప్టెన్‌ నైబ్‌ (42 బంతుల్లో 27; 2 ఫోర్లు)తో 44 పరుగులు, మూడో వికెట్‌కు హష్మతుల్లా షాహిది (45 బంతుల్లో 21; 2 ఫోర్లు)తో 42 పరుగులు జోడించి రహ్మత్‌ షా భారత శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. ఇలాగైతే కష్టమని భావించిన కోహ్లి 29వ ఓవర్లో బుమ్రాను రంగంలోకి దించడం ఫలితాన్నిచ్చింది.

అతడు రెండు బంతుల వ్యవధిలో రహ్మత్‌ షా, హష్మతుల్లాను ఔట్‌ చేయడం, అస్ఘర్‌ అఫ్గాన్‌ (8)ను చహల్‌ వెనక్కు పంపడంతో ఉపశమనం లభించింది. 90 బంతుల్లో 95 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆరో వికెట్‌కు నబీ, నజీబుల్లా జద్రాన్‌ (23 బంతుల్లో 21; 2 ఫోర్లు) వేగంగా 36 పరుగులు జత చేసి కలవరపెట్టారు. జద్రాన్‌ను హార్దిక్‌ ఔట్‌ చేశాక నబీ, రషీద్‌ఖాన్‌ (14)లు 24 పరుగులు జోడించి ఉత్కంఠ పెంచారు. బుమ్రా వేసిన 47వ ఓవర్లో నబీ సిక్స్‌ బాదడంతో మ్యాచ్‌ చేజారినట్లే కనిపించింది. 49వ ఓవర్లో బుమ్రా ఐదు పరుగులే ఇవ్వడంతో చివరి ఓవర్లో 16 పరుగులు అందుకోవడం అఫ్గాన్‌ తరం కాలేకపోయింది.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) హజ్రతుల్లా (బి) నబీ 30; రోహిత్‌ (బి) ముజీబ్‌ 1; కోహ్లి (సి) రహ్మత్‌ (బి) నబీ 67; విజయ్‌ శంకర్‌ ఎల్బీ (బి) రహ్మత్‌ 29; ధోని (స్టంప్డ్‌) ఇక్రమ్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 28; జాదవ్‌ (సి) (సబ్‌) నూర్‌ అలీ (బి) గుల్బదిన్‌ 52; పాండ్యా (సి) ఇక్రమ్‌ (బి) అఫ్తాబ్‌ 7; షమీ (బి) గుల్బదిన్‌ 1; కుల్దీప్‌ నాటౌట్‌ 1; బుమ్రా నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 224.

వికెట్ల పతనం: 1–7, 2–64, 3–122, 4–135, 5–192, 6–217, 7–222, 8–223.

బౌలింగ్‌: ముజీబ్‌ 10–0–26–1, అఫ్తాబ్‌ 7–1–54–1, నైబ్‌ 9–0–51–2, నబీ 9–0–33–2, రషీద్‌ 10–0–38–1, రహ్మత్‌ షా 5–0–22–1.  

అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: హజ్రతుల్లా (బి) షమీ 10; నైబ్‌ (సి) శంకర్‌ (బి) పాండ్యా 27; రహ్మత్‌ (సి) చహల్‌ (బి) బుమ్రా 36; హష్మతుల్లా (సి అండ్‌ బి) బుమ్రా 21; అస్ఘర్‌ (బి) చహల్‌ 8; నబీ (సి) పాండ్యా (బి) షమీ 52; నజీబుల్లా (సి) చహల్‌ (బి) పాండ్యా 21; రషీద్‌ (స్టంప్డ్‌) ధోని (బి) చహల్‌ 14; ఇక్రమ్‌ నాటౌట్‌ 7; అఫ్తాబ్‌ (బి) షమీ 0; ముజీబ్‌ (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్‌) 213.

వికెట్ల పతనం: 1–20, 2–64, 3–106, 4–106, 5–130, 6–166, 7–190, 8–213, 9–213, 10–213.

బౌలింగ్‌: షమీ 9.5–1–40–4, బుమ్రా 10–1–39–2, చహల్‌ 10–0–36–2, పాండ్యా 10–1–51–2, కుల్దీప్‌ 10–0–39–0.  

2: ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ తీసిన రెండో భారత బౌలర్‌ షమీ. 1987లో చేతన్‌ శర్మ ఈ ఘనత సాధించాడు.  
50:  ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌కు ఇది 50వ విజయం. ఆస్ట్రేలియా (67), న్యూజిలాండ్‌ (52) విజయాలతో ముందున్నాయి.

మరిన్ని వార్తలు