నన్ను కొత్తగా పిలుస్తున్నారు: వార్నర్‌

21 Jun, 2019 18:31 IST|Sakshi

నాటింగ్‌హామ్‌ : ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటికే రెండు శతకాలు , రెండు అర్దసెంచరీలతో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్నాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ శతకం(166)తో ఆసీస్‌కు ఘన విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్నర్‌ తన ఆటతీరు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పిచ్‌ ఎలా ఉన్నా, బౌలర్లు ఎంత కఠినమైన బంతులు విసిరినా చివరి వరకు క్రీజులో ఉండాలని నిశ్చయించుకున్నానని వెల్లడించాడు. అంతేకాకుండా తన సహచర ఆటగాళ్లు కొత్త నిక్‌ నేమ్‌ పెట్టారని తెలిపాడు. 

ప్రపంచకప్‌లో నా ప్రదర్శనతో సహచర ఆటగాళ్లు నాకు సరికొత్త పేరుపెట్టారు. కెరీర్‌ మొదట్లో నన్ను బుల్‌ అని పిలిచేవారు. మధ్యలో రెవరెండ్‌ అంటూ కాస్త మర్యాద ఇచ్చారు. ప్రస్తుతం ‘హమ్‌ బుల్‌’(హంబుల్‌)అంటూ సరికొత్త నిక్‌ నేమ్‌ పెట్టారు. వాళ్లు ప్రేమతో ఎలా పిలిచినా సంతోషమే. పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించినా సహకరించకున్నా క్రీజులో పాతుకపోవాలని భావించాను. నా ప్రదర్శన ఇలాగే కొనసాగించాలని భావిస్తున్నా’అంటూ వార్నర్‌ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో వార్నర్‌ భారీ శతకంతో సాధించడంతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఆస్ట్రేలియా తరపున ప్రపంచకప్‌లో 150కి పైగా పరుగులు సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకు ముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌, మాజీ వికెట్‌కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ల పేరిట ఉండేది.  జట్టు తరపున మొత్తం 16 సెంచరీలు చేసిన వార్నర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి రెండు స్థానాల్లో రికీ పాంటింగ్‌(29), మార్క్‌ వా(19)లు ఉన్నారు.

చదవండి:
‘ఎంత మంచి వాడవయ్య వార్నర్‌’
పంత్‌ ఆడేది చెప్పకనే చెప్పిన కోహ్లి?

మరిన్ని వార్తలు