‘ఎంత మంచి వాడవయ్య వార్నర్‌’

13 Jun, 2019 18:42 IST|Sakshi

టాంటన్‌ : కేవలం మైదానంలో ఆటతోనే కాకుండా మైదానం బయట తన మంచి మనసుతో హీరో అనిపించుకున్నాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌.  ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ శతక సహాయంతో ఆసీస్‌ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన ఈ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. అయితే బహుమతి ప్రధానోత్సవం అనంతరం ఆసీస్‌ అభిమానులకు ఆటోగ్రాఫ్‌, సెల్ఫీలు ఇచ్చాడు. అయితే మ్యాచ్‌ చూడటానికి వచ్చిన బుల్లి ఆసీస్‌ క్రికెట్‌ ఫ్యాన్‌కు ఫిదా అయిన వార్నర్‌, తనకు వచ్చిన ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. దీంతో బుడ్డోడితో సహా అక్కడు ఉన్నవారందరూ షాక్‌కు గురయ్యారు. ఇక ఈ విషయాన్ని ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో తెలిపింది.
కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ‘బ్యాట్‌తో వార్నర్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు.. మంచి మనసుతో అభిమానుల హృదాయాలను గెలుచుకుంటాడు’,‘ఎంత మంచి వాడవయ్య వార్నర్‌’అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక మ్యాచ్‌ అనంతరం వార్నర్‌ మాట్లాడుతూ.. నిషేధ సమయంలో ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్‌ వచ్చిందని తెలిపాడు. మానసికంగా బలహీనపడ్డ తనకు తన భార్య క్యాండిస్‌ శక్తినిచ్చినట్లు చెప్పాడు. అన్ని క్రికెట్‌ ఫార్మట్లకు తగ్గట్లుగా తనను తీర్చిదిద్దిందన్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో స్టీవ్‌ స్మిత్‌తో పాటు, వార్నర్‌ కూడా ఏడాది కాలం పాటు ఆసీస్‌ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. నిషేధం ముగిసిన అనంతరం ఐపీఎల్‌లో తన సత్తా చాటిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు