అర్థర్‌పై వేటు వేసే ఆలోచనలో పీసీబీ

7 Aug, 2019 15:40 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ప్రపంచకప్‌లో కనీసం సెమీస్‌కు చేరకుండానే ఇంటిబాట పట్టడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) దిద్దుబాటు చర్యలకు దిగింది. పాక్‌ క్రికెట్‌ జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్ని వైపుల విమర్శలు వస్తుండటంతో పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15తో ముగుస్తున్న కోచింగ్‌ బృందం కాంట్రాక్టును పొడగించకూడదని నిశ్చయించుకుంది. దీంతో 2016 నుంచి పాక్‌ క్రికెట్‌ జట్టుకు సేవలందిస్తున్న మికీ అర్థర్‌కు ఉద్వాసన పలకనుంది. అతడితో పాటు బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌, బౌలింగ్‌ కోచ్‌ అజహర్‌ మహ్మద్‌, ఇతర సిబ్బందిని కూడా కొనసాగించకూడదని పీసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్‌లో పాక్‌ వైపల్యానికి కోచింగ్‌ బృందం పొరపాట్లు కూడా ఉన్నాయని పీసీబీ విశ్వసిస్తోంది. దీంతో వారిపై వేటు వేయనుంది. ఇక జట్టును విజయపథంలో నడిపించే కొత్త కోచ్‌ ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. 

2016 నుంచి పాక్‌ జట్టుకు మికీ అర్థర్‌ విశేష సేవలందిస్తున్నాడు. అతడి కోచ్‌గా ఉన్న సమయంలోనే 2017 చాంపియన్‌ ట్రోఫీని పాక్‌ గెలుచుకుంది. ఇక అర్థర్‌ కూడా పాక్‌ జట్టుకు కోచ్‌గా కొనసాగేందుకు ఆసక్తి కనబర్చటం లేదని తెలుస్తోంది.  శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. రెండ్రోజుల క్రితమే ప్రపంచకప్‌ ఓటమిపై సమీక్ష జరగగా పీసీబీ ఏర్పాటు చేసిన కమిటీకి అర్థర్‌ కెప్టెన్సీ మార్పుపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడని సమాచారం. గత రెండేళ్లుగా సారథిగా సర్ఫరాజ్‌ అహ్మద్‌ పూర్తిగా విఫలమయ్యాడని, అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని పీసీబీకి అర్థర్‌ సూచించినట్టు సమాచారం.  

మరిన్ని వార్తలు