అదే అతి పెద్ద పరాభవం: రవిశాస్త్రి

18 Aug, 2019 12:14 IST|Sakshi

ఆంటిగ్వా: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించడమే తన గత రెండేళ్ల కోచింగ్‌ పర్యవేక్షణలో అతి పెద్ద పరాభవమని మరొకసారి ప్రధాన కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఆ మెగా టోర్నీలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచినప్పటికీ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. కేవలం 30 నిమిషాల ఆటే తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుందని రవిశాస్త్రి అన్నాడు.

‘ 2019 వరల్డ్‌కప్‌ లీగ్‌ దశలో కేవలం ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోయినా టాప్‌లో నిలిచాం. కానీ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పోరాడి ఓడిపోయాం. కేవలం 30 నిమిషాల ఆటే మమ్మల్ని వెనక్కి నెట్టింది. నా గత రెండేళ్ల కోచింగ్‌ కెరీర్‌లో అది పెద్ద పరాభవం. ఒక చెడు రోజు, ఒక చెత్త సెషన్‌ మాకు శాపంగా మారింది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.  ‘తదపరి రెండేళ్లలో రెండు ఐసీసీ టోర్నమెంట్‌లు ఉన్నాయి. ఇప్పటికే టెస్టు చాంపియన్‌షిప్‌ మొదలైంది. 2021లో టీ20 వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ రెండింటికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఆ మేరకు సన్నద్ధం కావడమే నా ముందున్న లక్ష్యం’ అని తెలిపాడు. గత వారం టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు