ఆశల పల్లకీలో లంక

28 Jun, 2019 04:50 IST|Sakshi
కరుణరత్నె

నేడు దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్‌

మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: టోర్నీ హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లండ్‌ను ఓడించిన ఊపులో, మిగిలిన మూడు మ్యాచ్‌లూ నెగ్గితే సెమీఫైనల్స్‌ చేరే అవకాశం ఉన్న స్థితిలో శ్రీలంక శుక్రవారం దక్షిణాఫ్రికాను ఎదుర్కొననుంది. ప్రత్యర్థి పరాజయాల పరంపరలో ఉన్నందున... లంకకు ఇది ఆశావహ పరిస్థితి. గత మ్యాచ్‌లో ఆల్‌ రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ రాణించడం, వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగ బుల్లెట్‌ బంతులతో సత్తా చాటడంతో జట్టు ఆత్మ విశ్వాసంతో కనిపిస్తోంది. ఓపెనర్లు కెప్టెన్‌ కరుణరత్నె, కుశాల్‌ పెరీరా మంచి ఇన్నింగ్స్‌లు ఆడితే లంక విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు.

ధనంజయ డిసిల్వా స్పిన్‌ను ఆడటం సఫారీలకు పరీక్షే. టోర్నీలో ఒక్కటంటే ఒక్కటే (అఫ్గానిస్తాన్‌) గెలుపుతో ఉన్న దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్‌ పరువుతో ముడిపడినది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆ జట్టు చివరి మ్యాచ్‌ను పటిష్టమైన ఆస్ట్రేలియా (జూలై 6న)తో ఆడాల్సి ఉంది. లంక చేతిలో ఓడితే, ఇక ఆసీస్‌ను నిలువరించడం అసాధ్యం. అదే జరిగితే తమ చరిత్రలోనే అత్యంత దారుణ పరాభవం మిగులుతుంది. కాబట్టి, శుక్రవారం మ్యాచ్‌ సఫారీలకు కీలకం. వెటరన్లు ఆమ్లా, మిల్లర్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న నేపథ్యంలో ఓపెనర్‌ డికాక్, కెప్టెన్‌ డుప్లెసిస్‌ పరుగులు సాధిస్తే ప్రత్యర్థికి పోటీ ఇవ్వగలుగుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పేసర్‌ రబడ కనీసం ఇప్పుడైనా సత్తా చాటుతాడేమో చూడాలి.

ముఖాముఖి రికార్డు
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 76 మ్యాచ్‌లు జరగ్గా... లంక 31 మ్యాచ్‌ల్లో నెగ్గింది. దక్షిణాఫ్రికా 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒకటి టై కాగా, మరోదాంట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో ఐదు సార్లు ఎదురుపడగా మూడుసార్లు దక్షిణాఫ్రికా, ఒకసారి లంక గెలిచాయి. మరో మ్యాచ్‌ (2003 కప్‌లో) ‘టై’గా ముగిసింది.

మరిన్ని వార్తలు