కోహ్లిపై వరల్డ్‌ మీడియా ఇలా..

4 Aug, 2018 11:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సాధించిన సెంచరీపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. పలు పత్రికలతోపాటు పలువురు సీనియర్‌ క్రికెటర్లు కోహ్లిని అభినందనలతో ముంచెత్తారు. పతనమౌతున్న భారత ఇన్నింగ్స్‌ బాధ్యతను చేపట్టి అద్వితీయ సెంచరీతో టెస్టుకు జీవం పోసిన కోహ్లి అంటూ ఇంగ్లండ్‌లోని పత్రికలు, వెబ్‌సైట్లు రాశాయి.

క్రికెట్‌.కామ్‌ సైట్‌ ‘కింగ్‌ కోహ్లి’ అని అభివర్ణించగా.. ఒంటిచేత్తో భారత్‌ను కాపాడిన ఆపద్బాంధవుడు అంటూ ది గార్డియన్‌ పొగిడింది. టెస్టు క్రికెట్‌కు కోహ్లి ఇన్నింగ్స్‌ వన్నెలద్దిందని, ఇది విరాట్‌ రోజు అని డైలీ మెయిల్‌ పేర్కొంది. మరొకవైపు మాజీ క్రికెటర్లు సైతం విరాట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘ విరాట్‌ ఒక గ్లోబల్‌ స్టార్‌. ప్రపంచ క్రికెట్‌లో ఉన్న అన్ని రికార్డులను కోహ్లి బ్రేక్‌ చేయడం ఖాయం’ అని ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ స్టీవ్‌ వా తన ట్వీటర్‌ అకౌంట్‌లో పేర్కొనగా, ‘విరాట్‌ ఈజ్‌ ద కింగ్‌’ అని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ ట్వీట్‌ చేశాడు. ‘ ఇదొక అసాధారణ ఇన్నింగ్స్‌. ఇంగ్లండ్‌ పిచ్‌లపై బంతిని అంచనా వేస్తూ విరాట్‌ సాధించిన సెంచరీ అమోఘం’ అని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ కొనియాడాడు.

ఇక హర్భజన్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘వాటే చాంపియన్‌. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించే తీరు నిజంగా అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నాడు. ‘ ఇది విరాట్‌ ఆడిన కీలక ఇన్నింగ్స్‌.  విరాట్‌ చేసిన మరో టెస్టు సెంచరీకి అభినందనలు’ అని సచిన్‌ ట్వీటర్‌ అకౌంట్‌లో ప్రశంసలు కురిపించాడు.

మరిన్ని వార్తలు