పసికూనే అయినా వణికించింది!

23 Mar, 2016 19:12 IST|Sakshi
పసికూనే అయినా వణికించింది!

న్యూఢిల్లీ: అండర్ డాగ్ గా  టీ20 వరల్డ్ కప్ లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆఫ్గనిస్థాన్ జట్టు తన పవర్ చాటింది. పసికూనే అయినప్పటికీ బలమైన ఇంగ్లండ్ జట్టుపై పోరాటపటిమ చూపింది. మొదట బౌలింగ్ చేసి ఇంగ్లండ్ ను 142 పరుగులకు కట్టడి చేసిన ఆ జట్టు.. ఆ తర్వాత లక్ష్యఛేదనలోనూ పర్వాలేదనిపించింది. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఆఫ్గన్ టాప్ ఆర్డర్ విఫలమైనా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన షఫిఖుల్లా దడదడలాడించాడు. 20 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో అతను 35 పరుగులు చేయడంతో ఆఫ్గన్ జట్టు దాదాపు లక్ష్యఛేధనకు చేరువగా వచ్చింది. మొదట బ్యాటింగ్ లో విఫలమై.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ అంతంతమాత్రం రాణించిన ఇంగ్లండ్ జట్టు చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో కేవలం 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 142 పరుగులు చేయగా.. ఆ తర్వాత లక్ష ఛేదనకు దిగిన ఆఫ్గన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఆఫ్గన్ జట్టులో లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన షఫిఖుల్లా 35, సమివుల్లా షెన్వారీ 22, నజీబుల్లా జార్డన్ 14  పరుగులతో రాణించారు.

అంతకుముందు ఆఫ్గన్ టాప్ ఆర్డర్ ఇంగ్లండ్ బౌలింగ్ ముందు బెంబేలెత్తిపోయింది. ఇంగ్లిష్ బౌలర్లు వేసే పదునైన బంతులు ఎదుర్కొలేక చతికిలపడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లో ఇద్దరు మాత్రం రెండంకెల స్కోరు చేశారు. నూర్ అలీ జార్డన్ 17, రషీద్ ఖాన్ 15 పరుగులతో కాస్తాకూస్తో క్రీజ్ లో నిలబడటానికి ప్రయత్నించారు. మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లో మహమ్మద్ షాజాద్ 4, కెప్టెన్ అస్ఘర్ స్తానిక్ జాయ్ ఒక పరుగుకు ఔటవ్వగా, గుల్బదిన్ నయబ్ డకౌటయ్యాడు. దీంతో 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు పది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి.. 45 పరుగులు చేసింది.

పసికూన ఆఫ్గన్ జట్టును ఇంగ్లండ్ బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. డీజే విల్లీ మూడు ఓవర్లలో 17 పరుగులకు రెండు వికెట్లు తీయగా, సీజే జోర్డన్, ఎంఎం అలీ, ఏయూ రషీద్ తలో వికెట్ తీశారు. టీ20 వరల్డ్ కప్ సూపర్ టెన్ లో భాగంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అలీ దూకుడుగా ఆడి 41 పరుగులు చేయగా, జేమ్స్ విన్సె 22, డేవిడ్ విల్లె 20 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ ఆఫ్గన్ బౌలర్ల ధాటికి అలవోకగా వికెట్లు సమర్పించుకున్నారు. అఫ్ఘాన్ బౌలర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ చెరో రెండు.. ఆమిర్ హంజా, షెన్వారి తలా వికెట్ తీశారు.

మరిన్ని వార్తలు