టెస్టు చాంపియన్‌షిప్ అనుమానమే

20 Dec, 2013 01:21 IST|Sakshi
టెస్టు చాంపియన్‌షిప్ అనుమానమే

దుబాయ్: ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఈ టోర్నీని స్పాన్సర్ చేసే విషయంలో స్పాన్సరర్స్, బ్రాడ్‌కాస్టర్స్ అంతగా ఆసక్తి చూపకపోవడమే దీనికి కారణం. ఇప్పటిదాకా ఐసీసీ ఈ అంశంలో ఎవరితోనూ ఒప్పందం కుదుర్చుకోలేక పోయింది. వన్డేలకు, టి20లకు ప్రపంచకప్ ఉన్నట్టే టెస్టుల్లోనూ ఓ మెగా టోర్నీ ఉండాలనే ఉద్దేశంలో ఐసీసీ ఈ చాంపియన్‌షిప్‌కు రూపకల్పన చేసింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం 2017లో ఇంగ్లండ్ వేదికగా ఇది జరగాల్సి ఉంది.

 2016 డిసెంబర్ 31 నాటికి ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న నాలుగు జట్లు మాత్రమే ఇందులో ఆడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ టోర్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆకర్షించగలుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అత్యంత ఆదరణ కలిగిన జట్లైన భారత్, ఇంగ్లండ్ జట్టు ఈ టోర్నీకి క్వాలిఫై కాకుంటే పరిస్థితి ఏమిటని స్పాన్సరర్స్, ప్రసారకర్తలు సంశయంలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో ఐసీసీ తీవ్ర ఒత్తిడికి లోనై టెస్టు చాంపియన్‌షిప్‌పై పునరాలోచన పడింది. దీనికోసం ఇప్పటికే రద్దు చేసిన చాంపియన్స్ ట్రోఫీని తిరిగి ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు