ఆశల పల్లకిలో...

15 Nov, 2018 02:15 IST|Sakshi

నేటి నుంచి మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌

73 దేశాలు... 300 మంది బాక్సర్లు 

ఆరో స్వర్ణం వేటలో మేరీకోమ్‌   

న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు దేశ రాజధాని వేదికగా రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 24 వరకు ఇందిరాగాంధీ స్టేడియంలో పోటీలు జరుగుతాయి. మొత్తం 10 విభాగాల్లో కలిపి 73 దేశాలకు చెందిన 300కు పైగా బాక్సర్లు ఈ ప్రతిష్టాత్మక పోరులో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. భారత్‌ నుంచి కూడా ఒక్కో విభాగంలో ఒకరు చొప్పున 10 మంది బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. 2001 నుంచి తొమ్మిది సార్లు మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌ నిర్వహించగా... 2006లో నాలుగో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ తర్వాత ఢిల్లీలో మళ్లీ ఇప్పుడు ఈ ఈవెంట్‌ జరుగుతోంది.

స్కాట్లాండ్, మాల్టా, బంగ్లాదేశ్, కేమన్‌ ఐలాండ్స్, డీఆర్‌ కాంగో, మొజాంబిక్, సియరా లియోన్, సోమాలియా దేశాలు తొలిసారి విశ్వ వేదికపై తలపడనుండటం ఈ పదో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మరో విశేషం. 2001 నుంచి 2010 మధ్య ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ జరిగితే తొలిసారి (2వ స్థానం) మినహా ఆ తర్వాత వరుసగా ఐదుసార్లు విజేతగా నిలిచిన భారత స్టార్‌ మేరీకోమ్‌ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి మేరీకోమ్‌కు యువ బాక్సర్ల నుంచి గట్టి పోటీ ఎదురు కావచ్చు. 2006లో ఇదే వేదికపై స్వర్ణం సాధించిన మరో భారత బాక్సర్‌ సరితా దేవిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. భారత్‌ ఒక స్వర్ణం సహా కనీసం మూడు పతకాలు గెలుచుకునే అవకాశం ఉందని జట్టు హై పెర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ శాంటియాగో నీవా ఆశాభావం వ్యక్తం చేశారు.  

భారత జట్టు: మేరీకోమ్‌ (48 కేజీలు), పింకీ జాంగ్రా (51 కేజీలు), మనీషా మౌన్‌ (54 కేజీలు), సోనియా (57 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (64 కేజీలు), లవ్లీనా బార్గోహైన్‌ (69 కేజీలు), సవీటీ బూరా (75 కేజీలు), భాగ్యవతి కచారీ (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్‌ 81 కేజీలు). 
 

మరిన్ని వార్తలు