పోరాడి ఓడిన శ్యామ్

24 Apr, 2014 01:37 IST|Sakshi
పోరాడి ఓడిన శ్యామ్

ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో కాంస్యంతో సరి
 సోఫియా (బల్గేరియా): ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ బరిలో నిలిచిన ఏకైక భారత బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన 49 కేజీల విభాగం సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్యామ్ కుమార్ 1-2తో శాల్కర్ అఖిన్‌బే  (కజకిస్థాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్‌లో తొలి రౌండ్‌ను చేజార్చుకున్న శ్యామ్ రెండో రౌండ్‌లో పైచేయి సాధించాడు. నిర్ణాయక మూడో రౌండ్‌లో మాత్రం అఖిన్‌బే ఆధిపత్యం చలాయించాడు. ఈ ఓటమితో శ్యామ్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ‘శ్యామ్ బాగా పోరాడాడు.
 
 అయితే ఓటమి ఓటమే. అతను యూత్ ఒలింపిక్స్‌కు అర్హత పొందడం సానుకూలాంశం’ అని భారత కోచ్ రామానంద్ తెలిపారు. భారత బాక్సింగ్ సమాఖ్యపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) నిషేధం కారణంగా ఈ మెగా ఈవెంట్‌లో భారత బాక్సర్లు ‘ఐబా’ పతాకం కింద పోటీపడ్డారు. మొత్తానికి ఈ చాంపియన్‌షిప్ భారత్‌కు నిరాశనే మిగిల్చింది. కేవలం ఒక కాంస్య పతకంతో భారత్ సంతృప్తి పడింది. 2012 ఈవెంట్‌లో భారత్‌కు రజతం, రెండు కాంస్యాలు వచ్చాయి. 2010లో వికాస్ కృషన్ స్వర్ణం సాధించాడు.
 

మరిన్ని వార్తలు