‘టీమిండియా రాకపోతే.. తీవ్రంగా నష్టపోతాం’

4 May, 2020 17:12 IST|Sakshi

సిడ్నీ: ప్రస్తుతం క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) దృష్టంతా భారత్‌పైనే ఉంది. కరోనా వైరస్‌ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా కూడా ఉన్నప్పటికీ అక్కడ  కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయితే ఈ ఏడాది చివరి నాటికి అంతా సద్దుమణిగి క్రీడా టోర్నీలో కూడా ఆరంభమైతే కొన్ని బోర్డులకు ఊరట లభిస్తుంది. ప్రస్తుతం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) మళ్లీ గాడిన పడాలంటే భారత్‌ పర్యటన ఒక్కటే మార్గమంటున్నారు ఆ దేశ క్రికెటర్లు. ఈ సీజన్‌ చివర్లో ఆస్ట్రేలియాలో  భారత్‌ పర్యాటించాల్సి ఉండటంతో అది ఏమౌతుందోనని ఆసీస్‌ క్రికెటర్లు ఆందోళనలోనే ఉన్నారు. భారత జట్టు తమ దేశంలో పర్యటిస్తేనే ఆర్థికంగా ఏర్పడ్డ నష్టాలను సీఏ పూడ్చుకోగలుగుతుందని టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కొన్ని రోజుల క్రితం పేర్కొనగా, తాజాగా ఆ దేశ స్టార్‌ ఆటగాడు లబూషేన్‌ సైతం ఇదే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. ఒకవేళ నిర్ణీత షెడ్యూల్‌లో భారత జట్టు పర్యటనకు రాకపోతే అది ఆర్థికపరమైన వినాశానికి దారి తీస్తుందన్నాడు. (‘టీమిండియా పర్యటనే మాకు శరణ్యం’)

ఈ టోర్నీ జరగకపోతే తనతో పాటు జట్టుకు దేశానికి కూడా తీవ్ర నష్టమేనని లబూషేన్‌ వెల్లడించాడు. మరో 3నుంచి 4 నెలల్లో కానీ, 4 నుంచి 5 నెలల్లో కానీ అంతా చక్కబడుతుందని  లబూషేన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.  ఒకవేళ అదే జరిగితే ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌  కచ్చితంగా వస్తుందన్నాడు. ఇటీవల టిమ్‌ పైన్‌ మాట్లాడుతూ.. టీమిండియా పర్యటనపై తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని, తమ కష్టాలకు భారత పర్యటనతో ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నానని పైన్‌ అన్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌ రాకపోతే 250 నుంచి 300 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లుతుందన్నాడు. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా-ప్రభుత్వం మధ్య ఇప్పటికే చర్చలు నడిచాయన్నాడు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా కొన్ని  ఆంక్షల్ని సడలించడమే కాకుండా, చార్టెడ్‌ విమానాలు, ఐసోలేషన్‌ వంటివి టీమిండియా క్రికెటర్ల కోసం ప్రత్యేకం ఏర్పాటు చేస్తుందన్నాడు. కాగా, ఆస్ట్రేలియాలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. దాంతో లాక్‌డౌన్‌ రూల్స్‌ను  కూడా సడలిస్తూ ముందుకు సాగుతోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఇప్పటివరకూ ఆస్ట్రేలియాలో 6,800 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మృతి చెందిన వారి సంఖ్య వంద కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. (అతని రీఎంట్రీ ఖాయం.. బెట్‌ వేస్తా: రాయుడు)

మరిన్ని వార్తలు