నేను అనర్హుడినా? 

21 Sep, 2018 01:11 IST|Sakshi

ఖేల్‌రత్న ఇవ్వకపోవడంపై రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా ఆగ్రహం 

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న దక్కకపోవడంపై స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ అంశంలో ప్రభుత్వంపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమయ్యాడు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న బజరంగ్‌ ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు. దీంతో భారత రెజ్లింగ్‌ సమాఖ్య అత్యున్నత క్రీడా పురస్కారానికి బజరంగ్‌ పేరు సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానులకు ఆ అవార్డుకు ఎంపిక చేసింది.

దీంతో ఆవేదనకు గురైన బజరంగ్‌ నేడు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకోనున్నాడు. ‘ఈ నిర్ణయం నన్ను విస్మయానికి గురిచేసింది. నిరాశలో కూరుకుపోయాను. యోగి భాయ్‌ (యోగేశ్వర్‌ దత్‌)తో మాట్లాడిన అనంతరం క్రీడల మంత్రితో సమావేశమవుతా. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ ఏడాది ఈ పురస్కారానికి నేను అర్హుడిగా భావిస్తున్నా. అందుకే ఈ అంశంపై మాట్లాడుతున్నా. అవార్డులు అడుక్కోవడం కాదు. కానీ... ఓ క్రీడాకారుడిగా ఖేల్‌రత్న అందుకోవడం చాలా పెద్ద గౌరవం’ అని బజరంగ్‌ వ్యాఖ్యానించాడు.   

మరిన్ని వార్తలు