‘ఖేల్‌రత్న’కు వినేశ్‌ 

1 Jun, 2020 03:46 IST|Sakshi

సిఫారసు చేయనున్న రెజ్లింగ్‌ సమాఖ్య

న్యూఢిల్లీ: భారత స్టార్‌ మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ బరిలో వరుసగా రెండో ఏడాది నిలవనుంది. వినేశ్‌ పేరును గతేడాదే ఈ అవార్డుకు నామినేట్‌ చేసినప్పటికీ బజరంగ్‌ పూనియాను అదృష్టం వరించింది. ఈ మూడేళ్లలో జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌ (2019)లో కాంస్యం, ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన వినేశ్‌... టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకున్న ఏకైక భారత మహిళా రెజ్లర్‌ కావడం విశేషం. దీంతో ఆమె పేరును భారత రెజ్లింగ్‌ సమాఖ్య ‘ఖేల్‌రత్న’ కోసం క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ ‘అర్జున అవార్డు’ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. 2016లోనే కేంద్రం ఆమెను ‘ఖేల్‌రత్న’తో సత్కరించింది. ఇతర రెజ్లర్లు దీపక్‌ పూనియా, రాహుల్‌ అవారే, సందీప్‌ తోమర్‌ ‘అర్జున అవార్డు’ను ఆశిస్తున్నారు. ఈ మేరకు సమాఖ్యకు దరఖాస్తులు సమర్పించారు.

మరిన్ని వార్తలు