కుస్తీ ఖుషీ

9 Sep, 2013 02:35 IST|Sakshi
కుస్తీ ఖుషీ

బ్యూనస్ ఎయిర్స్:  ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 2020, 2024 ఒలింపిక్స్‌లో 26వ క్రీడగా రెజ్లింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఆదివారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. పోటీలో నిలిచిన బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, స్క్వాష్‌లను ఓటింగ్‌లో వెనక్కి నెట్టి రెజ్లింగ్ తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. మొత్తం 95 ఓట్లలో రెజ్లింగ్‌కు అనుకూలంగా 49 ఓట్లు వచ్చాయి. స్క్వాష్‌కు 22 ఓట్లు మాత్రమే రాగా, అనూహ్యంగా బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్‌కు 24 ఓట్లు పడ్డాయి. ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు నాలుగు పతకాలు అందించిన రెజ్లింగ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రీడల జాబితా నుంచి ఐఓసీ తొలగించింది.
 
 దాంతో తన స్థానం నిలబెట్టుకునేందుకు మరోసారి రెజ్లింగ్ పోటీ పడాల్సి వచ్చింది. ఓటింగ్‌కు ముందు ఆదివారం ఈ మూడు ఆటలకు సంబంధించిన ప్రతినిధులు 20 నిమిషాల పాటు ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్తగా చేరిన రగ్బీ సెవెన్, గోల్ఫ్‌లతో కలిసి 2016 రియోడిజనిరో ఒలింపిక్స్‌లో మొత్తం 28 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. ‘మా ఆటను బతికించినందుకు కృతజ్ఞతలు. 3 వేల ఏళ్ల చరిత్ర గల మా క్రీడలో ఇదో కీలక రోజు. రెజ్లింగ్ ఆట నిలబడాలంటే ఒలింపిక్స్‌లో ఉండటం తప్పనిసరి’ అని అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (ఫిలా) అధ్యక్షుడు నేనాద్ లాలోవిక్ స్పందించారు.
 
 రెజ్లర్ల ఆనందం...
 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ను కొనసాగించడం పట్ల భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘రెజ్లింగ్ సమాజానికి ఇదో శుభవార్త. కుర్రాళ్లు ఈ ఆటను ఎంచుకునేందుకు తాజా నిర్ణయం తోడ్పడుతుంది. ప్రాచీన క్రీడను ఒలింపిక్స్‌లో కొనసాగించడం సంతోషకరం. రాబోయే ఒలింపిక్స్‌లో మన ఆటగాళ్లు మరిన్ని పతకాలు సాధిస్తారు’ అని సుశీల్ చెప్పాడు. మరో ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ కూడా ఆనందాన్ని ప్రకటించాడు. ‘రెజ్లర్ల మెడలపై కత్తి వేలాడుతూ ఉంది. ఇప్పుడు అది పోయింది. నేను మరో పతకం గెలిచినట్లుగా అనిపిస్తోంది. దీనికి సహకరించినవారికి కృతజ్ఞతలు’ అని దత్ అన్నాడు.
 

మరిన్ని వార్తలు