వినేశ్‌ ఫొగాట్‌ డబుల్‌ ధమాకా..

18 Sep, 2019 19:42 IST|Sakshi

నూర్‌-సుల్తాన్‌(కజకిస్తాన్‌): భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ డబుల్‌ ధమాకా సాధించింది. బుధవారం ఓకే రోజు ముగ్గురిని మట్టి కరిపించి తన సత్తా చాటుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో పాటు ప్రపంచ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం అందుకుంది. రెండూ ఒకే రోజు అందుకోవడంతో వినేశ్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌ షిప్‌లో వినేశ్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. అంతేకాకుండా ఈ మెగాటోర్నీలో పతకం సాధించిన నాలుగో భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఘనత సాధించారు. ‘రెపిచేజ్‌’లో భాగంగా బుధవారం ఒకే రోజు యులియా (ఉక్రెయిన్‌), ప్రపంచ నంబర్‌వన్‌ సారా అన్‌ (అమెరికా), ప్రివొలరిక్‌ (గ్రీస్‌)లపై అలవోక విజయాలు సాధించింది.

అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లోకి అడుగుపెట్టిన వినేశ్‌ ప్రిక్వార్టర్‌లోనే ప్రత్యర్థి దెబ్బకు తలొగ్గింది. మంగళవారం జరిగిన 53 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ మయు ముకయిద (జపాన్‌) 7–0తో వినేశ్‌ను ఓడించింది. దీంతో టైటిల్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. అయితే జపాన్‌ రెజ్లర్‌ తన జైత్రయాత్ర కొనసాగించి గెలిచి ఫైనల్‌ చేరింది. దీంతో వినేశ్‌కు ‘రెపిచేజ్‌’లో పాల్గొనే అవకాశం దక్కింది. రెపిచేజ్‌లో మూడు విజయాలు అందుకోవడంతో టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌తో పాటు కాంస్య పతకం గెలుచుకుంది. 

మరిన్ని వార్తలు