'నయా' పేస్

13 Sep, 2015 00:25 IST|Sakshi
'నయా' పేస్

♦ యూఎస్ ఓపెన్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన భారత వెటరన్
♦ హింగిస్‌తో కలిసి ‘మిక్స్‌డ్’ టైటిల్ సొంతం

 
 రేసులోకి దూసుకొస్తున్న కుర్రాళ్ల దెబ్బకు సహచరులందరూ వెనుకబడుతున్నారు... ఒకనాటి ప్రత్యర్థులందరూ ఏదో రకంగా ఆటకు గుడ్‌బై చెప్పేస్తున్నారు... కానీ... భారత వెటరన్ లియాండర్ పేస్ మాత్రం వన్నె తగ్గని వజ్రంలా ఇంకా మెరుస్తూనే ఉన్నాడు..ముదిమి వయసు ముంచుకొస్తున్నా... అచంచల ఆత్మవిశ్వాసంతో ఆటకే సవాలు విసురుతున్నాడు. నాలుగు పదుల వయసులోనూ తన రాకెట్‌కు ‘నయా పేస్ (కొత్త వేగం)’ను జోడించి యూఎస్ ఓపెన్‌లో చెలరేగిపోయాడు. హింగిస్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచి... ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా సగర్వంగా రికార్డులకెక్కాడు.
 
 న్యూయార్క్ : వయసు పెరుగుతున్నా.. రాకెట్‌లో పదును తగ్గలేదని నిరూపిస్తున్న భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ టెన్నిస్‌లో చరిత్ర సృష్టించాడు. స్విస్ ప్లేయర్ మార్టినా హింగిస్‌తో కలిసి యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో నాలుగోసీడ్ పేస్-హింగిస్ 6-4, 3-6, 10-7తో అన్‌సీడెడ్ బెథానీ మాటెక్ సాండ్స్-సామ్ క్వైరీ (అమెరికా)పై విజయం సాధించారు. 77 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ జోడి 32 విన్నర్లు సంధించి, ఐదు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో నాలుగింటిని కాపాడుకుంది.

 తొలిసెట్‌లో మాటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన పేస్-హింగిస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లారు. బలమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హాండ్ షాట్లతో చెలరేగిన ఈ జోడి సర్వీస్‌లోనూ నిలకడను చూపెట్టింది. మాటెక్-క్వైరీ కూడా తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో ఓ దశలో పేస్ జంట స్కోరు 5-4గా మారింది. పదో గేమ్‌లో ఓ అద్భుతమైన విన్నర్‌తో హింగిస్ సెట్‌ను సాధించింది. రెండోసెట్‌లో మాటెక్-క్వైరీ పోరాటం మొదలుపెట్టారు. మాటెక్ నేరుగా రెండు విన్నర్లు కొట్టడంతో పాటు హింగిస్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో 3-1 ఆధిక్యంలోకి వెళ్లారు.

అయితే 2-5తో వెనుకబడి ఉన్న దశలో హింగిస్ తన సర్వీస్‌లో మూడు సెట్ పాయింట్లను కాపాడుకుంది. కానీ తర్వాతి గేమ్‌లో క్వైరీ అద్భుతమైన సర్వీస్‌తో సెట్‌ను గెలవడంతో మ్యాచ్ టైబ్రేక్‌కు దారితీసింది. సూపర్ టైబ్రేక్‌లో అమెరికా ద్వయం హింగిస్ సర్వీస్‌లను బ్రేక్ చేస్తూ ఒక్కసారిగా 4-1 ఆధిక్యాన్ని సాధించింది. కానీ తర్వాతి 12 గేమ్‌ల్లో పేస్-హింగిస్ అసలు సిసలు ఆటను చూపెట్టారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 9 గేమ్‌లు గెలిచి సెట్‌తో పాటు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
 
 విశేషాలు
►ఓవరాల్‌గా ప్రస్తుతం మార్టినా నవ్రతిలోవా 10 టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉంది. మరో టైటిల్ గెలిస్తే పేస్ ఆమెను అందుకుంటాడు.
►తాజా విజయంతో పేస్-హింగిస్ 1969 తర్వాత ఒకే ఏడాదిలో మూడు గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ టైటిల్స్‌ను సాధించిన తొలి జంటగా రికార్డు సృష్టించారు. (ఈ సీజన్‌లో ఈ జోడి యూఎస్ ఓపెన్‌తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్‌ను కూడా సాధించింది.) 46 ఏళ్ల కిందట మార్టి రెస్సైన్-మార్గరెట్ కోర్టు ఈ ఫీట్‌ను సాధించారు.
►ఓవరాల్‌గా పేస్‌కు ఇది 17వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా, హింగిస్‌కు 19వది. హింగిస్... టెన్నిస్‌లో ఉన్న నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను భారతీయులతోనే కలిసి గెలవడం విశేషం.

మరిన్ని వార్తలు