డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్‌కు షాకింగ్‌‌ న్యూస్‌

24 Jun, 2020 09:26 IST|Sakshi

మార్క్‌ క్యాలవే అనే పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. అదే అండర్‌ టేకర్‌ అంటే తెలియని రెజ్లింగ్‌ అభిమాని ఉండరు. ముఖ్యంగా డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులకు ద డెడ్‌ మ్యాన్‌ (అండర్‌ టేకర్‌) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా రెజ్లింగ్‌ అభిమానులను తన ప్రదర్శనతో అలరిస్తున్న ఈ వెటరన్‌ రెజ్లర్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. రెజ్లింగ్‌ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. డబ్ల్యూడబ్ల్యూఈ విడుదలచేసిన అండర్‌ టేకర్‌ బయోపిక్‌ ‘ద లాస్ట్‌ రైడ్‌’ డ్యాక్యూమెంటరీ చివరి ఎపిసోడ్‌లో అండర్‌ టేకర్‌ తన నిర్ణయాన్ని వెల్లడించారు. 

‘ఇక సాధించాల్సింది ఏమీ లేదు. మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టాలని అనుకోవడం లేదు. ఇది చాలా మంచి స‌మ‌యం. ఇలాంటిది మ‌ళ్లీ రాదు. నా కెరీర్‌కు ముగింపు ప‌ల‌కడానికి ఏదైనా మంచి స‌మ‌యం ఉందంటే.. అది ఇదే’ అని ఆ డ్యాక్యుమెంటరీలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ట్విటర్‌లో కూడా తాజాగా అధికారికంగా వెల్లడించారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా అయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ చాంపియన్‌ షిప్‌ బెల్ట్‌ పట్టుకొని ఉన్న రోహిత్‌ శర్మ ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ థ్యాంక్యూ అండర్‌ టేకర్‌ అని ట్వీట్‌ చేసింది. 

52 ఏళ్ల అండర్‌ టేకర్‌ 1987లో వ‌రల్డ్ క్లాస్ ఛాంపియ‌న్‌షిప్ రెజ్లింగ్‌తో కెరీర్‌ను ఆరంభించారు. 1990ల్లో టెడ్ డిబియాస్ మిలియ‌న్ డాల‌ర్ టీంలో చివ‌రి స‌భ్యుడిగా డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈలో ఆయ‌న‌ అడుగుపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు క్రేజ్‌ ఉన్నప్పటికీ జాన్ సీనా, ద రాక్ మాదిరి సినిమాల్లోకి అడుగుపెట్ట‌లేదు. అండర్‌టేకర్‌ తన చివరి మ్యాచ్‌లో ఏజే స్టైల్స్‌తో తలపడ్డారు. కాగా, త‌న‌తో జ‌రిగిన మ్యాచ్చే అండ‌ర్‌టేక‌ర్‌కు చివ‌రిదైతే త‌నకెంతో గ‌ర్వంగా ఉంటుంద‌ని ఏజే స్టైల్స్ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు