ఇంగ్లండ్‌దే టీ20 సిరీస్‌

7 Mar, 2019 13:58 IST|Sakshi

గువాహటి: భారత మహిళలతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 112 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ మహిళలు 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌ ఉండగానే 2-0తో కైవసం చేసుకున్నారు. భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ డానియల్లీ వ్యాట్‌(64 నాటౌట్‌; 55 బంతుల్లో 6 ఫోర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండి విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఆమెకు జతగా లారెన్‌ విన్‌ఫీల్డ్‌(29; 23 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేశారు. భారత బ్యాటర్స్‌లో మిథాలీ రాజ్‌ చేసిన 20 పరుగులకే జట్టు తరఫున అత్యధిక స్కోరు. మంధాన(12), హర్లీన్‌ డియాల్‌(14), దీప్తి శర్మ(18), భారతి ఫుల్మాలి(18) ఇలా అంతా విఫలమయ్యారు. ఐదుగురు క్రీడాకారిణులు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో భారత్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రంట్‌ మూడు వికెట్లు సాధించగా, లిన్సే స్మిత్‌ రెండు వికెట్లు తీశారు. కేట్‌ క్రాస్‌, ష్రబ్‌సోల్‌లకు తలో వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు