జైస్వాల్‌ ఉతికి ఆరేశాడు..!

23 Feb, 2020 18:06 IST|Sakshi
యశస్వి జైస్వాల్‌(ఫైల్‌ఫొటో)

ముంబై: లిస్ట్‌-ఎ క్రికెట్‌లో పిన్నవయసులో డబుల్‌ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా ఇప్పటికే రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ మరోసారి బ్యాట్‌ ఝుళిపించాడు. అండర్‌-23 సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా పాండేచ్చేరితో జరుగుతున్న మ్యాచ్‌లో జైస్వాల్‌ భారీ సెంచరీ సాధించాడు. ఇటీవల అండర్‌-19 వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణించి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్న యశస్వి.. ఆ తర్వాత తొలి మ్యాచ్‌ ఆడుతూనే బ్యాట్‌కు పని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో పాండిచ్చేరి 209 పరుగులకు ఆలౌటైన తర్వాత.. ముంబై మొదటి ఇన్నింగ్స్‌ను జైస్వాల్‌-అమామ్‌ హకీమ్‌ ఖాన్‌లు ఆరంభించారు. హకీమ్‌(64) తొలి వికెట్‌గా ఔట్‌ కాగా, యశస్వి మాత్రం నిలకడగా ఆడాడు.

243 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 185 పరుగులు సాధించాడు. హకీమ్‌తో కలిసి తొలి వికెట్‌కు 98 పరుగులు నమోదు చేసిన జైస్వాల్‌.. రెండో వికెట్‌కు అర్జున్‌ టెండూల్కర్‌తో కలిసి 31 పరుగులు జత చేశాడు. మూడో వికెట్‌కు హార్దిక్‌ జితేంద్ర తామోర్‌(86)తో కలిసి 207 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే భారీ సెంచరీ సాధించిన యశస్వి.. డబుల్‌ సెంచరీని 15 పరుగుల వ్యవధిలో ఔటయ్యాడు. ఇటీవల ముగిసిన అండర్‌-19 వరల్డ్‌కప్‌లో యశస్వి 400 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఆ మెగా టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు చేరుకునే క్రమంలో యశస్వి ఒక అజేయం సెంచరీతో పాటు నాలుగు అర్థ శతకాలు నమోదు చేశాడు. 


 

మరిన్ని వార్తలు