తల్లి మనసు

15 Feb, 2020 10:35 IST|Sakshi
క్రికెటర్‌ యశస్వీ జైస్వాల్‌

యశస్వీ జైస్వాల్‌ దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చాడు. ఊరికే రాలేదు 400 రన్స్‌ చేసి, ‘మ్యాన్‌ ఆఫ్‌ ది 2020 అండర్‌–19 వరల్డ్‌ కప్‌’ టైటిల్‌ని కొట్టుకొచ్చాడు. ఉత్తరప్రదేశ్‌ అతడిది. ఇంటికి రాగానే తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఆనంద బాష్పాలు కావు అవి. బిడ్డ చిక్కి శల్యమైపోయాడు. పట్టుకుని ఏడ్చింది. ‘ఇంత సన్నగైపోయావేందిరా’ (కిత్నా సుఖ్‌ గయా హై తూ!) అని ఒళ్లు తడిమి చూసుకుంది. టీనేజ్‌ కుర్రాళ్లకు ఇలాంటి ఎమోషన్స్‌ నచ్చవు. తల్లిని కూడా దగ్గరకు రానివ్వరు. ‘‘నువ్వూర్కోమ్మా’’ అన్నాడు. ‘‘అంత మాట అనేశావేంట్రా అబ్బాయ్‌! తల్లి ఎలా ఊరుకుంటుంది’’ అన్నారు చుట్టుపక్కల వాళ్లు.

అప్పటికే వాళ్లంతా యశస్వీని చుట్టేశారు. నువ్వు మామూలోడివి కాదురా అన్నారు. ఊరికే క్రికెట్‌ క్రికెట్‌ అంటుంటే.. చదువు అబ్బడం లేదనుకున్నాం కానీ.. క్రికెట్‌లో మంచి ర్యాంకే తెచ్చుకున్నావురా అన్నారు. తల్లికి ఆ మాటలేవీ చెవికి ఎక్కడం లేదు. ‘‘ముందు కాస్త తిను నాయనా’’ అని  కొడుక్కి రొట్టెలు, శాకాహార పలహారం తెచ్చిపెట్టింది. తిన్నాడు. అప్పుడు కానీ ఆ తల్లి మనసు కుదుట పడలేదు. ‘నువ్వూర్కోమ్మా’ అని తల్లిని అన్న కొడుకు ఆ తర్వాత కాస్త ఫీల్‌ అయినట్లున్నాడు. ‘‘మా అమ్మకు ఎలా చెబితే అర్థమౌతుంది. ఆడాలంటే ఫిట్‌గా ఉండాలని’’ అన్నాడు.. అమ్మ కొంగుతో చేతులు తుడుచుకుంటూ.

మరిన్ని వార్తలు