జైస్వాల్‌ ట్రోఫీ రెండు ముక్కలైంది..!

14 Feb, 2020 12:27 IST|Sakshi

అదే నా చెడ్డ అలవాటు: యశస్వి

న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత ఆటగాడు యశస్వి జైస్వాల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పోరులో భారత్‌ చతికిలబడ్డా జైస్వాల్‌ ఆద్యంతం రాణించడంతో మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు వరించింది. అయితే సిల్వర్‌ కోటింగ్‌తో ఉన్న ఆ అవార్డు రెండు ముక్కలైందట. అది ఎలా ముక్కలైందనే విషయం జైస్వాల్‌కు గుర్తు లేదట. అంత విలువైన అవార్డును అలా పోగొట్టుకోవడంపై అతని కోచ్‌ జ్వాల సింగ్‌ మాట్లాడుతూ.. ‘ ఆ సిరీస్‌ ట్రోఫీ ముక్కలైనా జైస్వాల్‌ పెద్దగా ఏమీ బాధపడడని తెలిపాడు. ఇదేమీ తొలిసారి కాదని, చాలా సార్లు జరిగిందన్నాడు. అతను కేవలం పరుగులు కోసమే ఆలోచిస్తాడు కానీ అవార్డుల కోసం ఎక్కువగా ఆలోచించడు’ అని పేర్కొన్నాడు. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో జైస్వాల్‌ 88, 105 నాటౌట్‌, 62, 57 నాటౌట్‌, 29 నాటౌట్‌, 59 చేసిన స్కోర్లతో అత్యధిక పరుగులు నమోదు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌కు ఎంపికయ్యాడు. (ఇక్కడ చదవండి: పానీపూరి అమ్మడం నుంచి కరోడ్‌పతి వరకూ..)

ఇక జైస్వాల్‌ మాట్లాడుతూ.. ‘ ఇప్పటివరకూ ఏజ్‌ గ్రూప్‌ టోర్నమెంట్‌లు ఆడుతూ వచ్చా. ఇక నుంచి జాతీయ క్రికెట్‌పై దృష్టి పెట్టాలి. అంటే నా హార్డ్‌వర్క్‌ డబుల్‌ ఉండాలి. అందుకోసం తీవ్రంగా శ్రమించాలి. నన్ను నేను అర్థం చేసుకోవడం ముఖ్యం. నన్ను అవతలి వాళ్లు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే విషయంపై ఆలోచిస్తే సమయం వృథా తప్పితే ఏమీ ఉండదు. నువ్వు నీ కోసం ఆలోచించాలి. నా పోరాటం వరల్డ్‌తో కాదు.. నాతోనే పోరాడుతూ ఉంటా. నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది. కూల్‌ డ్రింక్స్‌ను ఎక్కువగా తీసుకుంటా. ఇప్పుడు వాటిని వదిలివేయడంపై మొదట దృష్టి పెట్టాలి. మెడిటేషన్‌పై కూడా ఫోకస్‌ చేయాలి. మన సక్సెస్‌లో ఫిట్‌నెస్‌ కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంపై సీరియస్‌గా దృష్టి పెట్టా’ అని జైస్వాల్‌ తెలిపాడు. 

మరిన్ని వార్తలు