యాసిర్ షా రికార్డు

29 Sep, 2017 11:56 IST|Sakshi

అబుదాబి: పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 150 వికెట్ల మార్కును చేరిన తొలి స్పిన్నర్ గా నిలిచాడు. శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా మొదటి రోజు యాసిర్ షా ఈ ఘనతను సాధించాడు. లంక బ్యాట్స్మన్ లహిరు తిరుమన్నే ను లెగ్ బిఫోర్గా అవుట్ చేయడం ద్వారా 150వ టెస్టు వికెట్ల మార్కును చేరాడు. తద్వారా ఈ ఫీట్ ను సాధించిన తొలి స్పిన్నర్ గా రికార్డు సాధించాడు. కాగా, ఓవరాల్ గా పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. గతంలో వకార్ యూనిస్ తన కెరీర్ లో 27 వ టెస్టు ఆడుతున్న సమయంలో ఈ ఫీట్  ను నమోదు చేశాడు. తాజాగా అతని సరసన యాసిర్ షా చేరిపోయాడు. ఇది యాసిర్ షాకు 27 వ టెస్టు.

ఇదిలా ఉంచితే, 150 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ సిడ్నీ బార్న్స్ తొలి స్థానంలో ఉన్నాడు. సిడ్నీ బార్న్స్ 24 టెస్టుల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. గతేడాది 100 టెస్టు వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్ గా యాసిర్ షా నిలిచిన సంగతి తెలిసిందే. 17వ టెస్టులో వంద వికెట్ల ఘనతను యాసిర్ సాధించాడు.

మరిన్ని వార్తలు