మీరు చూస్తోంది...updated version

19 Aug, 2015 00:19 IST|Sakshi
మీరు చూస్తోంది...updated version

♦ తన కెరీర్‌పై సైనా వ్యాఖ్య  
♦ ‘ప్రపంచ’ రజతంతో ఆనందం
♦ నాపై ఒత్తిడి తొలగిపోయింది
 
 ఎంత గొప్ప సాఫ్ట్‌వేర్ వచ్చినా... నిరంతరం దానిని అప్‌డేట్ చేస్తుండాలి... లేదంటే రేసులో వెనకబడిపోతారు.  క్రీడల్లోనూ అంతే... ఎన్ని విజయాలు వచ్చినా... నిరంతరం అప్‌డేట్ అవుతూనే ఉండాలి.. లేదంటే ఓడిపోతారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నె హ్వాల్ కూడా ఇదే సూత్రాన్ని అనుసరించింది.

 ఏడాది క్రితం తాను మరింత అప్‌డేట్ అవ్వాలన్న విషయాన్ని గుర్తించింది. కష్టమో... నిష్టూరమో... బెంగళూరుకు వెళ్లి కొత్త కోచ్ దగ్గర శిక్షణ మొదలుపెట్టింది. ఈ ఏడాదిలో అనేక విజయాలు... అందుకే ఇప్పుడు తనని తాను ‘అప్‌డేటెడ్ వెర్షన్’ అని సైనా స్వయంగా చెబుతోంది.
 
 సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ చాంపియన్‌షిప్ పతకంతో తనపై ఉన్న ఒత్తిడి తొలగిపోయిందని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చెప్పింది. ఇకపై ఎలాంటి టోర్నీలో అయినా స్వేచ్ఛగా ఆడగలనని తెలిపింది. ప్రపంచ వేదికపై రజతం సాధించిన అనంతరం సైనా సోమవారం రాత్రి స్వస్థలం చేరుకుంది.  ఇటీవలి తన ప్రదర్శనపై ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. విశేషాలు సైనా మాటల్లోనే...

 గెలిచి వచ్చాక సొంతగడ్డపై స్వాగతం:  గొప్పగా ఏమీ లేదు! అయితే నేను అతిగా ఆశించడం లేదు. సరిగ్గా చెప్పాలంటే ఇకపై ఇలాంటివాటిని పట్టించుకోవడం అనవసరం. నేను విజయాలు సాధిస్తున్నంత వరకు ఇలాంటివి చిన్న విషయాలే. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాను. ఆ సంతోషం చాలు.  

 ఫైనల్లో ఆటతీరు: సహజంగానే నిరాశ పడ్డాను. నేను రెండో గేమ్ గెలిస్తే పరిస్థితి భిన్నంగా ఉండేది. కోచ్ విమల్ కూడా మ్యాచ్ తర్వాత నాపై చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎలా ఆడావంటూ కోపగించారు. నేను నా 100 శాతం ఆటతీరు కనబర్చలేదనేది నిజం. రెండో గేమ్‌లో 18-18తో సమంగా ఉన్నప్పుడు లైన్ కాల్ ప్రత్యర్థికి అనుకూలంగా వెళ్లింది. అది కూడా ఫలితంపై ప్రభావం చూపించింది. అయితే మెడల్ గెలవడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. విజయానంతరం నా కోచ్‌లతో పాటు గోపీచంద్ కూడా వచ్చి అభినందించారు.

 కొత్త ప్రత్యర్థి మారిన్: గత రెండేళ్లలో కరోలినా ఎదుగుదల అనూహ్యం. నాతో పాటు అగ్రశ్రేణి ప్లేయర్లు అందరినీ ఆమె ఓడిస్తూ వస్తోంది. సయ్యద్ మోడి ఫైనల్లో నేను నెగ్గినా, ఆమె ఆట నన్ను కాస్త ఆందోళనపరచింది. ఆల్ ఇంగ్లండ్‌లో మారిన్ నన్ను చిత్తు చేసింది. అయితే ఆల్ ఇంగ్లండ్ ఫైనల్‌తో పోలిస్తే నా ఆట చాలా బాగుంది. ఈసారి ఫైనల్లో ఆమె గొప్పతనంకంటే నా ఓటమికి నేనే కారణమని నమ్ముతా. నాకు ప్రమాదకర ప్రత్యర్థిగా మారుతున్న మారిన్ కోసం కూడా ఇకపై  ప్రత్యేకంగా సిద్ధం కావాల్సి ఉంటుంది.

 క్వార్టర్స్ అనంతరం ఉద్వేగానికి లోను కావడం: ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉందో మాటల్లో చెప్పలేను. ఒక సారి, రెండు సార్లు కాదు... ఐదు సార్లు ఆ దశలోనే ఆగిపోయాను. ఇక పతకం అయితే వచ్చేసిందనే ఆనందంతో గెంతులేశాను. రాకెట్‌ను విసిరేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా సంబరం చేసుకోవడంతో అంపైర్ కూడా హెచ్చరించారు!

 ఏడాది కాలంలో వచ్చిన మార్పు: ఆటలో నా వేగం పెరిగింది. స్ట్రోక్స్ చాలా మెరుగయ్యాయి. ర్యాలీలు కూడా చాలా వేగంగా ఆడుతున్నాను. మానసికంగా కూడా దృఢంగా తయారయ్యాను. ఇదంతా గత ఏడాది కాలంలో విమల్ కుమార్ దగ్గర శిక్షణ అనంతరం వచ్చిన మార్పు. ఆస్ట్రేలియన్, చైనా ఓపెన్ గెలిచాను, ఆల్ ఇంగ్లండ్‌లో పతకం దక్కింది, నంబర్‌వన్ కూడా కాగలిగాను. సరిగ్గా చెప్పాలంటే ‘మీరు ఇప్పుడు చూస్తోంది సైనా అప్‌డేటెడ్ వెర్షన్’. కానీ దీని కోసం ఎంతో కష్ట పడ్డాను. తల్లిదండ్రులను వదిలి ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆట తప్ప మరో దానిని పట్టించుకోలేదు.

 మరో ఒలింపిక్ మెడల్: రెండు సార్లు ఒలింపిక్ పతకం గెలిచిన సుశీల్‌తో సమం కావాలని నేనూ ఆశిస్తున్నా. అయితే దానికి ఇంకా సంవత్సరముంది. ఆలోగా సాధ్యమైనన్ని ఎక్కువ టోర్నీలు గెలవాలి. ఇంత బిజీ షెడ్యూల్‌లో రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. కెరీర్‌లో అన్నీ గెలిచేసిన సంతృప్తి ఉంది.  కాబట్టి ఇకపై ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు మాత్రం అవకాశం ఉంటుంది.
 
 బాహుబలి బాగా నచ్చింది
 ప్రపంచ చాంపియన్‌షిప్ సన్నాహకాల్లో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు కాస్త వినోదం కావాల్సిందే కదా. ఇటీవలే బాహుబలి, భజరంగి భాయిజాన్ సినిమాలు చూశాను. బాగా నచ్చాయి. నేను బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌కు పెద్ద ఫ్యాన్ అనే విషయం అందరికీ తెలుసు. అయితే అతని సినిమాలేవీ ప్రస్తుతం లేవు. అతని తర్వాతి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇంట్లో నా కుక్క పిల్ల ‘చాప్సీ’తో కూడా సరదాగా గడుపుతా. ఒకటి, రెండు రోజుల్లోనే మళ్లీ ట్రైనింగ్‌కు వెళ్లిపోవాల్సి ఉంది.
 
 జొకోవిచ్‌ను పదిమందితో కలిపితే ఎలా?
 నేను వరల్డ్ బ్యాడ్మింటన్‌లో టాప్ షట్లర్లలో ఒకదానిని. వరల్డ్ నంబర్‌వన్, టూ అయ్యాను. అలాంటి ప్లేయర్‌పై శిక్షణ సమయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ చాంపియన్ ప్లేయర్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. జొకోవిచ్‌లాంటి ఆటగాడికి పది మంది బృందంలో కోచింగ్ ఇస్తే ఎలా ఉంటుంది! ఏడాది క్రితం సరిగ్గా నేనూ ఆ స్థితిలోనే ఉన్నాను. ర్యాంక్ తొమ్మిదికి పడిపోయింది. చిన్న చిన్న ప్లేయర్ల చేతిలో ఓడుతూ వచ్చాను. సింగపూర్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాను. ఆ సమయంలో నా ఆటను ఎలా మార్చుకోవాలో అర్థం కాక సతమతమయ్యాను. సరిగ్గా ఆ సమయంలోనే నాకు కావాల్సిన మద్దతు దొరకలేదు. అందుకే బెంగళూరుకు మారాను. ఒకవేళ ఇక్కడి అకాడమీలోనే  ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో!

మరిన్ని వార్తలు