పంత్‌పై కఠిన నిర్ణయాలు తప్పవు: రవిశాస్త్రి

16 Sep, 2019 10:56 IST|Sakshi

న్యూఢిల్లీ:  టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ పదే పదే అవకాశాలు చేజిక్కించుకుంటున్నా వాటిని అందిపుచ్చుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాడు. ఎంఎస్‌ ధోని స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో పంత్‌పైనే టీమిండియా యాజమాన్యం ఎక్కువ మొగ్గుచూపుతోంది. అయితే పంత్‌ ఒకే తరహా షాట్‌కు ఔట్‌ కావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో డీప్‌ స్వేర్‌ లెగ్‌లో ఔటవుతున్న తీరు అతని స్థానానికి ఎసరు తెచ్చేలా కనబడుతోంది. దీనిపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి కూడా. పంత్‌ను తప్పించి మరో టాలెంటెడ్‌ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. 

తన ఆట తీరును పంత్‌ ఒక్కసారి పరిశీలించుకోవాలని ఇప్పటికే గౌతం గంభీర్‌ సుతి మెత్తగా విమర్శించాడు. సంజూ శాంసన్‌ నుంచి ఒక కఠినమైన సవాల్‌ ఎదురుకాబోతుంది అంటూ కూడా పంత్‌కు సీరియస్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చాడు గంభీర్‌.  టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి సైతం పంత్‌ ఆటను మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవంటూ హెచ్చరించాడు. ‘ఇక్కడ టాలెంట్‌ ఉందా.. లేదా అనేది ముఖ్యం కాదు. నిలకడైన ఆట తీరే ప్రధానం. అతడికి మా ప్రోత్సాహం ఉంటుంది. కానీ ట్రినిడాడ్‌ మ్యాచ్‌లో తొలి బంతికే అతడు ఔటైన తీరు మళ్లీ రిపీట్‌ అయితే మా  నిర్ణయాలు కఠినంగా ఉంటాయి.  విండీస్‌తో జరిగిన మూడో వన్డేను చూడండి. తొలి  బంతికే బౌల్డ్‌ అయ్యాడు. ఈ తరహా షాట్లు పదే పదే పునరావృతం చేస్తే అతనికి ఉద్వాసన తప్పదు. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌ కొనసాగిస్తే జట్టు విజయాల్లో భాగం అవుతాడు. ఇక పంత్‌ తనని తాను నిరూపించుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని రవిశాస్త్రి మందలించాడు.

మరిన్ని వార్తలు