దూసుకొచ్చాడు!

14 Feb, 2019 00:03 IST|Sakshi

దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న హైదరాబాద్‌ యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ

వేర్వేరు వయో విభాగాల్లో పరుగుల వరద

భారత్‌ అండర్‌–19 ‘బి’ జట్టులో చోటు 

అండర్‌–14 జట్టు తరఫున ఆడుతుండగానే అండర్‌–16లో చోటు... అండర్‌–16లో ఉన్నప్పుడే అండర్‌–19 టీమ్‌కు ఎంపిక... అండర్‌–19 తరఫున బరిలోకి దిగిన సమయంలోనే అండర్‌–23 జట్టులో అవకాశం... ఆటలో ఒక ప్రతిభ గల కుర్రాడు ఎలా దూసుకుపోతున్నాడో ఈ పురోగతి చూపిస్తుంది. హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్‌ నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ ప్రదర్శన ఇది. వేర్వేరు వయోవిభాగాల్లో ఇప్పటికే సత్తా చాటిన తిలక్‌ మరోసారి భారత అండర్‌–19 ‘బి’ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. తనకు లభించిన పరిమిత అవకాశాల్లోనే దూకుడైన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించిన అతను మరింతగా దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నాడు. 

సాక్షి, హైదరాబాద్‌:  సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో గడిపే సహనం... మైదానంలో నలుదిశలా చక్కటి స్ట్రోక్స్‌ ఆడగల సత్తా... ఫార్మాట్‌ను బట్టి ఆటతీరు మార్చుకోగల నైపుణ్యం... చిన్న వయసు నుంచే నిలకడగా భారీ స్కోర్లు సాధించగల ప్రతిభ... ఇవన్నీ 16 ఏళ్ల తిలక్‌ వర్మను ప్రత్యేకంగా నిలబెడతాయి. భవిష్యత్తులో హైదరాబాద్‌ నుంచి జాతీయ సీనియర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించగల సత్తా ఉన్న ఆటగాడిగా క్రికెట్‌ వర్గాల్లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకోవడం అతని బ్యాటింగ్‌ బలాన్ని చూపిస్తోంది. ఎడంచేతి వాటం ఓపెనర్‌ అయిన తిలక్‌ ఇప్పటికే ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. దాదాపు మూడేళ్ల క్రితం దేశవాళీ అండర్‌–16 టోర్నీ విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో భారీగా పరుగులు సాధించడంతో అందరి దృష్టి అతనిపై పడింది. ఆ టోర్నీలో ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 5 సెంచరీలు (ఇందులో ఒక డబుల్‌ సెంచరీ), 2 అర్ధసెంచరీలతో ఏకంగా 960 పరుగులు సాధించడం విశేషం. అప్పటి నుంచి అతని కెరీర్‌ వేగంగా దూసుకుపోతోంది. విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచినందుకు తిలక్‌ వర్మకు బీసీసీఐ వార్షిక అవార్డుల్లో దాల్మియా పురస్కారం లభించింది.
 
లీగ్‌లలో భారీ స్కోర్లు... 
సాధారణ నేపథ్యం... తండ్రి ఒక ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగి... సన్నిహిత బంధువు ఒకరు క్రికెట్‌ ఆడటం చూసిన తర్వాత కలిగిన ఆసక్తితో ఆటలో చేరిన తిలక్‌ వేగంగా నేర్చుకున్నాడు. క్రికెట్‌లో కోచ్‌ సాలమ్‌ బయాష్‌ వద్ద ప్రాథమికాంశాలు నేర్చుకున్న అనంతరం తిలక్‌ వర్మకు వెంటవెంటనే అవకాశాలు వచ్చాయి. ముందుగా జాతీయ స్థాయి అండర్‌–14 టోర్నీలో ఆడేందుకు హైదరాబాద్‌ టీమ్‌లో స్థానంతో పాటు కెప్టెన్సీ అవకాశం కూడా దక్కింది. ఇక్కడే బెస్ట్‌ బ్యాట్స్‌ మన్, బెస్ట్‌ కెప్టెన్‌ అవార్డులు కూడా దక్కాయి. ఇక అండర్‌–16 టోర్నీ అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత హెచ్‌సీఏ లీగ్‌లలో పరుగుల వర్షం కురిపిం చాడు. ఫలితంగా ఎన్నో సెంచరీలు అతని ఖాతాలో చేరాయి. లీగ్‌ మ్యాచ్‌ల ఫలితాలలో దాదాపు ప్రతీ రోజు అతని పేరు వినిపించిందంటే అతిశయోక్తి కాదు.  

అండర్‌–19 సభ్యుడిగా... 
భారీ స్కోర్లు సాధిస్తుండటంతో తిలక్‌ను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. గత ఏడాది తొలిసారి హైదరాబాద్‌ అండర్‌–19 టీమ్‌లో స్థానం లభించింది. నాలుగు ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, ఒక హాఫ్‌ సెంచరీ చేయడంతో సౌత్‌జోన్‌ టీమ్‌లోకి కూడా ఎంపికయ్యాడు. హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ టోర్నీలో కూడా అతను మూడు ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలు, ఒక అర్ధసెంచరీ సాధించడం విశేషం. ఫలితంగా గత ఏడాది కూడా క్వాడ్రాంగులర్‌ టోర్నీలో భారత్‌ అండర్‌–19 ‘బి’ టీమ్‌లో అవకాశం లభించింది. ‘బి’ విజేతగా నిలిచిన ఈ టోర్నమెంట్‌లో వర్మ 40, 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఈసారి కూడా మళ్లీ అదే అవకాశం వచ్చింది. తాజా సీజన్‌లో అండర్‌–19 టోర్నీలో చెలరేగిపోవడమే మళ్లీ జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. నాలుగు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు సహా 779 పరుగులతో అతను హైదరాబాద్‌ తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  

రంజీ అవకాశం... 
అండర్‌–19లో ఆడుతూ ఉండగానే అండర్‌–23 సీకే నాయుడు ట్రోఫీ కోసం హైదరాబాద్‌ టీమ్‌లో అవకాశం లభించింది. జార్ఖండ్‌పై తొలి మ్యాచ్‌లోనే 160 పరుగులు చేసి అతను సత్తా చాటాడు. ఇదే జోరులో తాజా సీజన్‌లో రంజీ ట్రోఫీలో కూడా అరంగేట్రం చేశాడు. ఆంధ్రతో ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన అతను 5, 34 పరుగులే చేసినా... 16 ఏళ్ల వయసులోనే రంజీ ఆడే అవకాశం దక్కడం ఈ కుర్రాడిలో ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా నాయకత్వ లక్షణాలు కూడా ఉన్న తిలక్‌... సీజన్‌ చివరి రెండు మ్యాచ్‌లలో హైదరాబాద్‌ అండర్‌–19 టీమ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. మున్ముందు కూడా ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే తొందరలోనే టీమిండియా అవకాశం కూడా అతనికి దక్కవచ్చు. శేరిలింగంపల్లిలోని లేగల క్రికెట్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న తిలక్‌ ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. తిలక్‌ వర్మ సోదరుడు తరుణ్‌ వర్మ జాతీయ బ్యాడ్మింటన్‌ ఆటగాడు కావడం విశేషం.  

వరల్డ్‌ కప్‌  ఆడటమే లక్ష్యం... 
అండర్‌–19 టీమ్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌లో రాణించినా వరల్డ్‌ కప్‌ స్థాయి టోర్నీల్లో ఆడినప్పుడే బాగా గుర్తింపు లభిస్తుంది. ఇప్పుడు సీనియర్‌ టీమ్‌లో ఉన్న చాలా మంది విషయంలో అదే జరిగింది. వచ్చే ఏడాది ఆరంభంలో జూనియర్‌ వరల్డ్‌ కప్‌ ఉంది. కాబట్టి అందులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నా. ప్రస్తుతం క్వాడ్రాంగులర్‌లో ‘బి’ తరఫున బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నా. ఇక్కడ రాణిస్తే ఆ వెంటనే దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా అవకాశం లభిస్తుంది. కాబట్టి దానిపై కూడా దృష్టి పెట్టా. సహజంగానే భారత జట్టు తరఫున ఆడాలనేదే
 నా అసలు లక్ష్యం.  – ఠాకూర్‌ తిలక్‌ వర్మ  

ఎవరి అండదండలు లేకుండా ఇంత వేగంగా తిలక్‌ ఎదుగుతున్నాడంటే కేవలం అతని ప్రతిభే కారణం. మేటి బ్యాట్స్‌మన్‌కు  ఉండాల్సిన లక్షణాలన్నీ అతనిలో పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి వికెట్‌పైనైనా ఆడగలడు. ముఖ్యంగా కవర్‌డ్రైవ్, బ్యాక్‌ ఫుట్‌ పంచ్‌ అద్భుతంగా ఉంటాయి. క్రమశిక్షణతో పాటు సుదీర్ఘ సమయం పాటు నిర్విరామంగా ప్రాక్టీస్‌ చేయగల పట్టుదల కూడా అతనిలో ఉంది. ఒక కోచ్‌గా చెప్పాలంటే అతని ఆటలో లోపాలు దాదాపుగా లేవు. మున్ముందు తిలక్‌ మరింత ఎదగాలని కోరుకుంటున్నా.  – సాలమ్‌ బయాష్, కోచ్‌ 

మరిన్ని వార్తలు