అటు 14... ఇటు 48

17 Dec, 2019 01:37 IST|Sakshi
నూర్‌ అహ్మద్‌ లఖన్‌వాల్‌,ప్రవీణ్‌ తాంబే

ఐపీఎల్‌ వేలానికి ఆ ఇద్దరు

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఎంతో మంది కుర్రాళ్లకు పట్టం కట్టింది. అలాగే అనుభవజ్ఞులకూ అవకాశమిచ్చింది. గత 12 ఏళ్లుగా ఆటలో కుర్రాళ్లకు, సహాయ సిబ్బందిలో అనుభవజ్ఞులకు  కూడా ఎంతో పేరు తెచ్చిపెట్టింది ఈ లీగ్‌. అయితే కొత్తగా ఈ సారి ఓ 14 ఏళ్ల కుర్రాడు, 48 ఏళ్ల అనుభవజ్ఞుడు ఇద్దరు కూడా ఆట కోసమే వేలం పాటకు అందుబాటులో ఉన్నారు. విచిత్రంగా ఉంది కదూ! ఆ టీనేజర్‌ అఫ్గానిస్తాన్‌ క్రికెటర్‌ నూర్‌ అహ్మద్‌ లఖన్‌వాల్‌  అయితే... ఆ వెటరన్‌ మన ముంబైవాలా ప్రవీణ్‌ తాంబే! చిత్రంగా ఇద్దరు స్పిన్నర్లే కాగా... లఖన్‌వాల్‌ చైనామన్‌. ఈ అఫ్గానీ ఆటగాడు రాజస్తాన్‌ రాయల్స్‌ నుంచి ఆహ్వానం దక్కడంతో ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా ఈ టీనేజ్‌ చైనామన్‌ జట్టు వర్గాల్ని ఆకట్టుకున్నట్లు తెలిసింది. ఇటీవల లక్నోలో భారత అండర్‌–19 జట్టుతో జరిగిన సిరీస్‌లో నూర్‌ అహ్మద్‌ లఖన్‌వాల్‌ 9 వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతోపాటు అఫ్గానిస్తాన్‌ అండర్‌–19 జట్టు తరఫున త్వరలో అండర్‌–19 ప్రపంచకప్‌ ఆడనున్నాడు. వచ్చే నెల దక్షిణాఫ్రికాలో కుర్రాళ్ల మెగా ఈవెంట్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో మణికట్టు బౌలర్‌పై ఫ్రాంచైజీల ఆసక్తి పెరిగింది. మరోవైపు వయసురీత్యా అర్ధసెంచరీ కొట్టబోతున్న వెటరన్‌ స్పిన్నర్‌ తాంబే ఐపీఎల్‌లో ఇదివరకు రాజస్తాన్‌ రాయల్స్, గుజరాత్‌ లయన్స్‌ (ఇప్పుడు లేదు), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడాడు.

మరిన్ని వార్తలు