కోహ్లిని పిల్లలు అనుకరిస్తారనే భయం: ద్రవిడ్

31 Oct, 2017 11:48 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లితో అభిప్రాయ బేధాల కారణంగా టీమిండియా కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే కొన్ని నెలల క్రితం తప్పుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కుంబ్లేతో కలిసి క్రికెట్ ఆడిన భారత జూనియర్, 'ఎ' జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ తొలిసారి స్పందించాడు. అదొక దురదృష్ట ఘటనగా పేర్కొన్న ద్రవిడ్.. ఆ ఘటన గురించి తనకు పూర్తిగా తెలియదన్నాడు. అయితే కుంబ్లేను ఒక లెజెండ్ క్రికెటర్ గా అభివర్ణించిన ద్రవిడ్.. అతని వ్యవహారంలో అలా జరగకుండా ఉంటే బాగుండేదన్నాడు. కాగా, తాను క్రికెట్ ఆడిన రోజుల్లో సైతం కోచ్ ల కంటే ఆటగాళ్లే శక్తిమంతులుగా ఉండేవారంటూ స్పష్టం చేశాడు. వారికి నచ్చకపోతే కోచ్‌లను తప్పిస్తారనేది గతంలో కూడా జరిగిందని ద్రవిడ్ తెలిపాడు. తాను కూడా అండర్-19, ఇండియా-ఏ జట్ల కోచ్ బాధ్యతల నుంచి ఏదో ఒక రోజు తప్పుకోవాల్సి వస్తుందని తెలుసని, కాకపోతే అది సరైన పద్ధతి ప్రకారం జరగాలని మిస్టర్ డిపెండబుల్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే కోహ్లి గురించి కొన్నివిషయాల్ని ద్రవిడ్ విశ్లేషించాడు.

'విరాట్ కోహ్లి చాలా దూకుడుగా వ్యవహరిస్తాడు. కోహ్లి దూకుడు అనేది అతనికి సంబంధించినది. కాకపోతే చాలామంది అతడిలా నేనెందుకు దూకుడుగా ఉండలేదని అడుగుతుంటారు. కానీ అది నాకు సెట్‌ కాదు. ఒక్కొక్కరిది ఒక్కో తరహా. ఇక్కడ రహానే చూడండి. అతను చాలా కూల్ గా ఉంటాడు. అలా ప్రతీ ఒక్కరి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. ఇటీవల ఆసీస్ తో సిరీస్ సందర్భంగా కోహ్లి చాలా ఆవేశంగా మాట్లాడాడు. అలా మాట్లాడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ కోహ్లి ఆ సిరీస్‌ను సీరియస్‌‌గా తీసుకున్నాడని, మైదానంలో మాటలకు దిగడం వల్ల అతడు మరింతగా రాణిస్తున్నాడని తర్వాత అర్థమైందని చెప్పాడు. అది విరాట్ రాణించడానికి ఉపయోగపడుతుంది' అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే ఈతరం పిల్లలు(12 నుంచి 14 ఏళ్లు లోపు) విరాట్ ను గుడ్డిగా అనుకరిస్తారని భయం కూడా తనకుందన్నాడు. తాము తదుపరి విరాట్ కోహ్లి అనుకుని ఆ రకంగా దూకుడును కొనసాగిస్తే అది మంచిది కాదన్నాడు. అది వారికి సెట్ అవుతుందా, లేదా అని చూడకుండా  అలా వ్యవహరిస్తే ఇబ్బందులకు దారి తీస్తుందని ద్రవిడ్ తెలిపాడు.

మరిన్ని వార్తలు