మీ తమ్ముడి వల్లే భారత క్రికెట్ వెనక్కి వెళ్లింది..

30 Nov, 2015 16:19 IST|Sakshi
మీ తమ్ముడి వల్లే భారత క్రికెట్ వెనక్కి వెళ్లింది..

న్యూఢిల్లీ:  గతంలో భారత జట్టు డర్బన్ లో పర్యటించినప్పుడు ఓ జిమ్ లో వ్యాయామం చేస్తున్నతనపై ఇయాన్ చాపెల్ వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లు సచిన్ టెండూల్కర్ తాజాగా వెల్లడించాడు. శనివారం ఓ ఆంగ్ల పత్రికకు సచిన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో  చాపెల్ బ్రదర్స్(ఇయాన్ చాపెల్, గ్రెగ్ చాపెల్)పై సచిన్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. నీ విజయ రహస్యం ఇదన్నమాట అని ఇయాన్ మాట్లాడటంతో తాను ఘాటుగా స్పందించినట్లు సచిన్ పేర్కొన్నాడు. అంతకుముందు 'నీ ముఖం అద్దంలో చూసుకో' అని అప్పటి కోచ్ గా ఉన్న గ్రెగ్ చాపెల్ విమర్శించడం.. అటు తరువాత ఇయాన్ ఇలా మాట్లాడటంతో తనకు చిర్రెత్తుకొచ్చినట్లు సచిన్ తెలిపాడు. 'మీ అన్నదమ్ములిద్దరూ అవసరాన్ని బట్టి మాట్లాడతారు. మీ తమ్ముడి వల్లే సమస్యంతా. చాపెల్ నిర్వాకం వల్ల భారత క్రికెట్ ఐదేళ్లు వెనక్కివెళ్లింది' అని తాను సమాధానమిచ్చినట్లు మాస్టర్ పేర్కొన్నాడు.


ఏడాది క్రితం సచిన్‌ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వేలో గ్రెగ్‌ చాపెల్ పై సచిన్ భారీగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చాపెల్ ను ఓ రింగ్ మాస్టర్ గా పేర్కొంటూ తరుచు క్రికెటర్ల మధ్య వివాదాలను సృష్టించేందుకు యత్నించేవాడని సచిన్ తన ఆత్మకథలో పేర్కొన్నాడు. చాపెల్ తన అభిప్రాయాల్ని బలవంతంగా ఆటగాళ్లపై రుద్దేడమే కాకుండా రాహుల్ ద్రవిడ్ , వీవీఎస్ లక్ష్మణ్ లనూ తప్పించాలని చాపెల్ వ్యూహం పన్నాడని సచిన్ తన పుస్తకంలో పేర్కొనడం వివాదానికి కేంద్ర బిందువైంది. భారత క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియన్ గ్రెగ్ చాపెల్ కోచ్‌గా పనిచేసిన రెండేళ్ల కాలం అత్యంత వివాదాస్పదం. జట్టు ప్రదర్శన సంగతి పక్కన పెడితే...ప్రతీ ఆటగాడు ఆ సమయంలో తీవ్ర అభద్రతా భావానికి లోనయ్యాడనేది ఎవరూ కాదనలేని అంశం.

మరిన్ని వార్తలు