దుమ్మురేపిన ‘దుర్గ’

6 Nov, 2019 13:31 IST|Sakshi

క్రీడాపాఠశాల విద్యార్థినికి అరుదైన అవకాశం

ఇండియన్‌ ఫుట్‌బాల్‌ క్యాంపునకు ఎంపిక

ఉమన్‌ వరల్డ్‌కప్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం

కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలకు చెందిన క్రీడాకారిణి దుర్గ ఫుట్‌బాల్‌ క్రీడాంశంలోదుమ్మురేపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటిన కామసాని దుర్గ.. తాజాగా 2020లో  నిర్వహించే ప్రపంచ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే ఇండియాజట్టు ఎంపికల కోసం నిర్వహించే వరల్డ్‌కప్‌ ప్రిపరేషన్‌ నేషనల్‌ క్యాంపునకు ఎంపికైంది. క్యాంపులో ఈమె చక్కటి ప్రతిభ కనబరిస్తే 16 దేశాల క్రీడాకారిణులు పాల్గొనే ఈ ప్రపంచ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో రాష్ట్రం నుంచి ఈమె ప్రాతినిథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి.

కడప స్పోర్ట్స్‌ : కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలలో పదోతరగతి చదువుతున్న కామసాని దుర్గ ఫుట్‌బాల్‌ క్రీడలో చక్కగా రాణిస్తోంది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కె.ఎన్‌.పెంట గ్రామానికి చెందిన రమేష్‌రెడ్డి, రోశమ్మల కుమార్తె అయితే ఈమె తొలుత హకీంపేటలోని క్రీడాపాఠశాలలో ప్రవేశం పొందింది. రాష్ట్ర విభజన అనంతరం స్థానికత ఆధారంగా 2014లో ఈమెను కడప వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఫుట్‌బాల్‌ శిక్షకుడు ఎం. హరి వద్ద ఫుట్‌బాల్‌లో మెలకువలు నేర్చుకోవడంతో పాటు పలు టోర్నమెంట్‌లలో రాణిస్తూ వచ్చింది. ఎస్‌జీఎఫ్, అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి, సౌత్‌జోన్, జాతీయస్థాయి పోటీల్లో నిలకడగా రాణిస్తూ వస్తోంది. కర్నూలు, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఈమె సత్తాచాటారు. అదే విధంగా 2015–16లో భోపాల్‌లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఈమె రాణించారు. 2016–17లో చెన్నైలో నిర్వహించిన ఖేలోఇండియాలోను, సబ్‌జూనియర్‌ విభాగంలో సత్తాచాటారు. 2017–18లో బెంగుళూరు, పూణేలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్, ఊర్జా మీట్‌లలో సత్తాచటారు. 2018–19లో కటక్‌లో నిర్వహించిన సబ్‌జూనియర్స్‌లోను, త్రిపురలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ నేషనల్‌ పోటీల్లో ఈమె చక్కటి ప్రతిభ కనబరిచారు. 2019–20 సంవత్సరానికి గాను ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి సుబ్రతోముఖర్జీ టోర్నమెంట్‌లో ఈమె చక్కటి ప్రతిభ కనబరిచారు.

మలుపు తిప్పిన సుబ్రతోముఖర్జీ టోర్నమెంట్‌..
ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన సుబ్రతో ముఖర్జీ టోర్నమెంట్‌లో ఈమె ఆటతీరుకు చక్కటి గుర్తింపు లభించింది. దీంతో ఆమెను 2020 ఉమెన్స్‌ వరల్డ్‌కప్‌ ప్రిపరేషన్‌ నేషనల్‌ క్యాంపునకు ఎంపిక చేశారు. ఏపీ నుంచి ఈ క్యాంపునకు ఎంపికైన ఏకైక క్రీడాకారిణి ఈమె కావడం విశేషం. ఈ క్యాంపు పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కత సమీపంలోని కల్యాణి నగరంలో ఈనెల 4 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ క్యాంపులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను ఇండియా అండర్‌–17 ఉమెన్స్‌ ఫుట్‌బాల్‌ టీంనకు ఎంపిక చేశారు. 2020 నవంబర్‌ 2 నుంచి 21వ తేదీ వరకు మనదేశంలో నిర్వహించనున్నారు. వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాల క్రీడాకారిణి ఇండియన్‌ ఫుట్‌బాల్‌ క్యాంపునకు ఎంపికకావడం పట్ల క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి ఎస్‌.బాషామోహిద్దీన్, ఫుట్‌బాల్‌ కోచ్‌ హరి సంతోషం వ్యక్తం చేశారు.   

మరిన్ని వార్తలు