యువరాజ్ శ్రమ వృథా, రాజస్థాన్ ఘన విజయం!

11 May, 2014 23:36 IST|Sakshi
యువరాజ్ శ్రమ వృథా, రాజస్థాన్ ఘన విజయం!
బెంగళూర్: ఐపీఎల్-7 టోర్నిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టు ఇంకా 7 బంతులుండగానే విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయంలో నాయర్, స్మిత్, ఫాల్కనూర్ లు కీలక పాత్ర పోషించారు. నాయర్ హాఫ్ సెంచరీ సాధించగా, స్మిత్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48, ఫాల్కనూర్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. యువరాజ్ సింగ్ బౌలింగ్ లోనూ రాణించడంతో ఓదశలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులే చేసింది. కాని చివర్లో స్టీవ్ స్మిత్, ఫాల్కనూర్ లు ధాటిగా ఆడటంతో సులభంగా విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణించిన యువరాజ్  ఈ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. 
 
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టును ఓపెనర్లు క్రిస్ గేల్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు నిరాశపరిచారు. ఓ దశలో బెంగళూరు జట్టు 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. బెంగళూరు జట్టు ఆటగాడు జోల్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన యువరాజ్ భారీ షాట్లతో స్కోరును పరుగులు పెట్టించారు. యువరాజ్ కు తోడుగా డివిల్లీయర్స్ కూడా భారీ షాట్లు కొట్టడంతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ 38 బంతుల్లో 7 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 83 పరుగులు, డివిల్లియర్స్ 32 బంతుల్లో 5 సిక్సర్లు, 1 ఫోర్ తో 58  చేశారు. 
 
>
మరిన్ని వార్తలు