-

యూవీపై కేసు.. తల్లి స్పందన

21 Oct, 2017 09:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా స్టార్ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌పై గృహ హింస కేసు నమోదు అయినట్లు రెండురోజులుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే వెంటనే రంగంలోకి దిగిన యూవీ ఫ్యామిలీ న్యాయవాది ఆ ఆరోపణలు ఖండించాడు. కానీ, యూవీ కుటుంబానికి నోటీసులు పంపించిన మాట వాస్తవమేనని గుర్‌గ్రామ్‌ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యువరాజ్‌ తల్లి షబ్నమ్‌ సింగ్ స్పందించారు. 

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... తమ కుటుంబం పరువు బజారుకీడుస్తున్న కోడలు ఆకాంక్షపై  మండిపడ్డారు. భర్తతో దూరంగా ఉంటున్న రెండేళ్ల తర్వాత ఆమె పోరాటం దేనికోసమంటూ ఆకాంక్షను ఆమె నిలదీశారు. అసలు యువరాజ్ తో ఈ కేసుకు సంబంధం ఏంటి? ఆకాంక్ష యువరాజ్ సోదరుడు జొరావర్‌ సింగ్‌ భార్య మాత్రమే.  బిగ్‌ బాస్‌తోసహా పలు ఇంటర్వ్యూల్లో ఆమె(ఆకాంక్ష) యువీ తనకు సోదరుడులాంటివాడని చెప్పింది. అలాంటి వ్యక్తిపై కేసు పెట్టే ప్రయత్నం ఇప్పుడేందుకు చేస్తున్నట్లు అని ఆకాంక్షపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆమె చీప్‌ పబ్లిసిటీకి పాల్పడుతోంది. యువరాజ్ ఓ సెలబ్రిటీ కాబట్టి.. అతని హోదాను అడ్డుపెట్టుకుని డబ్బు గుంజాలని యత్నిస్తోంది అని షబ్నమ్‌ ఆరోపించారు. తమ కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని.. తనంతట తానే ఇంట్లోంచి వెళ్లిపోయిందన్నారు.  జోరవర్​-ఆకాంక్షలు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ గతంలోనే కోర్టును ఆశ్రయించారని, మరి అటువంటప్పుడు మళ్లీ  గృహహింస కేసు వార్తలు రావడం అర్థరహితమన్నారు. యువీ అరెస్టయ్యాడా? అంటూ అంతా అడుగుతుంటే తమ కుటుంబం చిత్రవధ అనుభవిస్తోందని షబ్నమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆకాంక్ష ఫిర్యాదు మేరకు గురుగ్రామ్‌ పోలీసులు యువీ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. 

ఆకాంక్ష ఆరోపణలు ఏంటంటే... 

ఆకాంక్ష తన భర్త జోర్‌వర్‌, అతని సోదరుడు యువరాజ్‌ సింగ్‌, అత్త షబ్నమ్‌లపై గృహ హింస కేసు నమోదు చేసింది. భర్త, అత్తలు హింసిస్తుంటే... యువీ అడ్డుకోకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయాడంట. ఆ లెక్కన్న అతన్ని కూడా నిందితుడిగా భావించాల్సి ఉంటుందని ఆకాంక్ష తరపు న్యాయవాది చెబుతున్నారు. ఇదిలా ఉంటే నేడు ఈ కేసు విచారణకు రాగా, వచ్చే నెల 21కి వాయిదా వేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు