‘ఇక్కడ తప్పెవరిదో మీరే చెప్పండి’

24 May, 2020 08:47 IST|Sakshi

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ‘త్రో బ్యాక్‌’ ట్రెండ్‌ నడుస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్న క్రికెటర్లు తమ గత స్మృతులను గుర్తుచేసుకుంటూ ఫ్యాన్స్‌ను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్బజన్‌ సింగ్‌ తన ఇన్‌స్టాలో హైదరాబాద్‌ వేదికగా 2005లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తను 17 బంతుల్లో 37 పరుగులు కొట్టిన వీడియోను షేర్‌ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన యువరాజ్‌ సింగ్‌తో భజ్జీ మంచి భాగస్వామ్యం నమోదు చేస్తున్న తరుణంలో యువీ అనవసరంగా రనౌట్‌ అయ్యాడు. ఇదే విషయాన్ని భజ్జీ ప్రస్తావిస్తూ ఈ రనౌట్‌లో తప్పెవరిదని ఆ వీడియో కింద కామెంట్‌ జతచేశాడు.  

‘అనవసరంగా పరుగు తీసి రనౌట్‌ అయ్యావు. ఇందులో తప్పెవరిదీ? మొత్తానికి మంచి ఇన్నింగ్స్‌ ఆడావు’ అంటూ భజ్జీ కామెంట్‌ చేశాడు. దీనిపై స్పందించిన యువీ ‘పాజీ ఈ రనౌట్‌లో నీ తప్పేమి లేదు. నేనే ముందు పిలిచా. అందుకే నేనే వెనుదిరిగిపోయాను. అయినా నువ్వు నీ బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తావనే నమ్మకం ఉంది అప్పుడు’అంటూ బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఇక ఈమ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేయగా టాపార్డర్‌ పూర్తిగా విఫలమైంది. అయితే యువీ (103; 122 బంతుల్లో 10 ఫోర్లు, 3సిక్సర్లు) సెంచరీతో రాణించాడు. యువీకి తోడు ఇర్ఫాన్‌ పఠాన్‌(46), హర్భజన్‌ (37 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ సాధించింది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన దక్షణాఫ్రికా కలిస్‌ (68), గ్రేమ్‌ స్మిత్‌ (48)లు రాణించడంతో 5 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. 

చదవండి:
బంతులే బుల్లెట్‌లుగా మారి...
బీసీసీఐ మాటే నెగ్గుతుంది: చాపెల్‌ 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు