పీఎం కేర్స్‌కు యువీ విరాళం

6 Apr, 2020 11:55 IST|Sakshi
యువరాజ్‌ సింగ్‌(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ కరోనా కట్టడి కోసం తనవంతు మద్దతు ప్రకటించాడు. కరోనా వైరస్‌ నివారణలో  భాగంగా రూ. 50 లక్షలను పీఎం-కేర్స్‌కు విరాళంగా ఇచ్చాడు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం(ఏప్రిల్‌5) దీప ప్రజ్వలనకు సంఘీభావం తెలిపిన యువీ.. తన  విరాళాన్ని కూడా ప్రకటించాడు. ఈ విషయాన్ని తన ట్వీటర్‌ అకౌంట్‌ ద్వారా తెలియజేశాడు. ‘ మనం ఎప్పుడైతే సమక్యంగా నిలబడతామో అప్పుడే మరింత పటిష్టంగా మారతాం. నేను కూడా దీప ప్రజల్వనలో భాగమవుతున్నా. నేను రూ. 50 లక్షల విరాళాన్ని పీఎం-కేర్స్‌ ఫండ్స్‌ కు విరాళంగా ఇచ్చా’ అని యువీ తెలిపాడు. (రోహిత్‌పై యువరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు)

ఆదివారం నాటికి భారత్‌లో 3, 374 పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 77 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడిన 267 మంది ఇప్పటివరకూ డిశ్చార్జి అయ్యారు. అంతకుముందు రోహిత్‌ శర్మ, సచిన్‌ టెండూల్కర్‌ తదితరులు పీఎం-కేర్స్‌కు విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. రోహిత్‌ శర్మ రూ. 80 లక్షల విరాళం ప్రకటించాడు. పీఎం–కేర్స్‌ నిధికి రూ. 45 లక్షలు, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, ‘జొమాటో ఫీడింగ్‌ ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 5 లక్షలు, వీధి శునకాల సంక్షేమం కోసం రూ. 5 లక్షలు కేటా యించాడు. ఇక సచిన్‌ టెండూల్కర్‌ సైతం రూ. 50 లక్షల విరాళం ఇచ్చాడు. ఇందులో రూ.25 లక్షలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో రూ. 25 లక్షలు ప్రధానమంత్రి సహాయనిధికి ఇచ్చాడు.(నెమార్‌ విరాళం రూ. 7 కోట్ల 64 లక్షలు)

మరిన్ని వార్తలు