మన టాపార్డర్‌ సూపర్‌ కదా.. అందుకే!: యువీ

7 Sep, 2019 14:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నా నాల్గో స్థానానికి ఇంకా సరైన సమాధానం దొరకలేదు. ప్రధానంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాల్గో స్థానం అనేది కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో దీనిపై గత కొంతకాలంగా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ నాల్గో స్థానంలో కచ్చితమైన ఆటగాడ్ని వెతకడంలో విఫలం కావడం కూడా అతనిపై వేటుకు ప్రధాన కారణం. ఇప్పుడు కొత్త బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ మరి నాల్గో స్థానంపై ఎంతవరకూ సక్సెస్‌ సాధిస్తాడో అనేది ఆసక్తికరం. ఇదిలా ఉంచితే, నాల్గో స్థానంపై భారత వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఒక పేరును సూచించాడు.

సంజూ శాంసన్‌ను నాల్గో స్థానంలో ఎందుకు ప్రయత్నించకూడదు అని మేనేజ్‌మెంట్‌కు విన్నవించాడు. అతనిలో మంచి టెక్నిక్‌ ఉందని, ఈ స్థానంలో అతన్ని పరీక్షించితే మంచి ఫలితం రావొచ్చు అని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా-ఏతో జరిగిన సిరీస్‌లో సైతం తానేమిటో నిరూపించుకున్నాడు అని భజ్జీ గుర్తు చేస్తూ ఒక ట్వీట్‌ చేశాడు. దీనికి భారత్‌ క్రికెట్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ పెద్దలు స్పందించకపోయినా,  తన స్నేహితుడు, మాజీ  క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘ మన టాపార్డర్‌ సూపర్‌ కదా బ్రో.. మనకి నాల్గో స్థానంలో బ్యాట్స్‌మన్‌ అవసరం లేదు’ అంటూ కాస్త వ్యంగ్యంగా రిప్లై ఇచ్చాడు. ఒకవేళ యువరాజ్‌ కొంటెగా సమాధానమిచ్చాడా.. లేక మన టాపార్డర్‌ నిజంగానే సూపర్‌ అయితే నాల్గో స్థానంపై చర్చ ఎందుకు అనేది సగటు క్రీడాభిమాని ప్రశ్న.

మరిన్ని వార్తలు