ఈ బ్యాట్‌తో ఎక్కడ కొడతానో తెలుసా?

18 May, 2020 10:11 IST|Sakshi
ఆనాటి మ్యాచ్‌లో భారత్‌ విజయం తర్వాత ఫ్లింటాఫ్‌-యువీలు ఇలా(ఫైల్‌ఫొటో)

ఫ్లింటాఫ్‌తో వాగ్వాదాన్ని గుర్తు చేసుకున్న యువీ

న్యూఢిల్లీ: 2007 టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ ఎలా రెచ్చిపోయాడు మనకు తెలుసు. ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌  బ్రాడ్‌ బౌలింగ్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. లాంగాన్‌, లాంగాఫ్‌, మిడాన్‌, మిడాఫ్‌ ఇలా ప్రతీ షాట్‌ ఆడేసి యువీ ఆరు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ కెరీర్‌ ముగిసిపోయేంత పని చేశాడు యువీ. ఇదే విషయాన్ని స్టువర్ట్‌ బ్రాడ్‌ తండ్రి క్రిస్‌ బ్రాడ్‌ సైతం యువీకి చెప్పి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అయితే అదే మ్యాచ్‌లో జరిగిన మరో సంఘటనను యువరాజ్‌ గుర్తు చేసుకున్నాడు.  ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ ఫ్లింటాఫ్‌తో జరిగిన వాడివేడి వాగ్వాదాన్ని  యువీ నెమరువేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌తో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ‘ ఫ్రెడ్డీ(ఫ్లింటాఫ్‌) వరుసగా రెండు మంచి బంతులు వేశాడు. అందులో ఒకటి యార్కర్‌.  ఆ రెండు బంతుల్ని ఫోర్లు కొట్టా. (స్టేడియాలు తెరుచుకోవచ్చు )

అప్పుడు అతను నా దగ్గరకు వచ్చి అవి డాష్‌ షాట్స్‌ అని అవహేళనగా మాట్లాడాడు. చాలా గంభీరంగా ఆ మాట అన్నాడు. నేను నీ గొంతు కోస్తా అని మాటలు అదుపు తప్పాడు. దాంతో నాకు చిర్రెత్తుకొచ్చింది. నా చేతిలో బ్యాట్‌ చూశావా. ఈ బ్యాట్‌తో నిన్ను ఎక్కడ కొడతానో తెలియదు. నాకు ఆ సమయంలో చాలా కోపం వచ్చేసింది. ఆ తర్వాత ఓవర్‌లోనే నేను బ్రాడ్‌ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టా. ఆరు సిక్సర్ల తర్వాత దిమిత్‌ మస్కరెనాస్‌ వైపు చూసి, అప్పుడు ఫ్లింటాఫ్‌ వైపు కూడా చూశా. అప్పుడు కానీ కోపం చల్లారలేదు’ అని యువీ పేర్కొన్నాడు. అసలు ముందు మస్కరెనాస్‌ వైపు చూడటానికి కారణం కూడా వెల్లడించాడు. ‘నేను ఆరు సిక్సర్లు కొట్టిన కొద్ది ముందుగా అతను ఒక వన్డే మ్యాచ్‌లో ఐదు సిక్సర్లు కొట్టాడు. అందుకే అతన్ని ముందు చూశా. అది ఇప్పటికీ బాగా గుర్తుంది’ అని యువీ పేర్కొన్నాడు.

ఫ్లింటాఫ్‌తో గొడవ 18 ఓవర్‌లో జరగ్గా, బ్రాడ్‌ బౌలింగ్‌లో  ఆరు సిక్సర్లను 19 ఓవర్‌లో సాధించాడు యువీ. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 218 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌ 200 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ 7 సిక్స్‌లు, 3 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో భాగంగా ఇంకా ఒక బంతి మాత్రమే ఉందనగా ఫ్లింటాఫ్‌ బౌలింగ్‌లో  యువీ ఔటయ్యాడు. ఆనాటి టీ20  వరల్డ్‌కప్‌ను ధోని నేతృత్వంలోని భారత్‌‌ సాధించడంలో యువరాజ్‌ కీలక పాత్ర పోషించగా, 2011 వన్డే  వరల్డ్‌కప్‌ను టీమిండియా గెలవడంలో కూడా ముఖ్య భూమిక  పోషించాడు. యువరాజ్‌ తన కెరీర్‌లో 304 వన్డేలు, 58 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. ఇక 40 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. (వరల్డ్‌ కప్‌ వాయిదా పడితే... )

మరిన్ని వార్తలు