యువరాజ్‌ ‘మళ్లీ’ వచ్చాడు

6 Jan, 2017 23:54 IST|Sakshi
యువరాజ్‌ ‘మళ్లీ’ వచ్చాడు

భారత వన్డే, టి20 జట్టులో స్థానం
టి20ల్లో నెహ్రా పునరాగమనం
రిషభ్‌ పంత్‌కు తొలి అవకాశం
పూర్తి స్థాయి కెప్టెన్‌గా కోహ్లి   


యువరాజ్‌ సింగ్‌ భారత జట్టు తరఫున వన్డేలు ఆడి మూడేళ్లు దాటింది. ఈ ఫార్మాట్‌లో తన చివరి రెండేళ్లలో 19 మ్యాచ్‌లు ఆడిన అతని బ్యాటింగ్‌ సగటు 18.53 మాత్రమే. బహుశా అతను కూడా తన పునరాగమనంపై ఆశలు పెట్టుకొని ఉండకపోవచ్చు. కానీ బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ అతనిలోని వన్డే ఆటగాడిని చూసింది. దాంతో మరోసారి యువరాజ్‌ భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఆశ్చర్యకరంగా గత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో బాగా ఆడినప్పుడు వన్డేలను కాదని భారత టి20 జట్టులోకి ఎంపిక చేసిన సెలక్టర్లు, ఈసారి రంజీ ట్రోఫీ ప్రదర్శనను బట్టి వన్డే జట్టులోకి అవకాశం కల్పించారు.  

ముంబై: సీనియర్‌ ఆటగాళ్లు యువరాజ్‌ సింగ్, ఆశిష్‌ నెహ్రా భారత జట్టులోకి తిరిగి వచ్చారు. యువీకి వన్డే, టి20 జట్లలో చోటు లభించగా, గాయం నుంచి కోలుకున్న నెహ్రాకు టి20 టీమ్‌లో అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌లలో తలపడే భారత జట్లను ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది. రంజీ ట్రోఫీలో చెలరేగిన ఢిల్లీ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు తొలి అవకాశం దక్కడం ఎంపికలో మరో విశేషం. సెలక్షన్‌ కమిటీ సమావేశానికి హాజరు కాలేకపోయిన కోహ్లి... స్కైప్‌ ద్వారా ఎంపికలో భాగమయ్యాడు.

రంజీ ప్రదర్శనతో...
భారత్‌ తరఫున ఆఖరి సారిగా యువరాజ్‌ టి20 ప్రపంచ కప్‌లో ఆడి చివరి లీగ్‌ మ్యాచ్‌ సమయంలో గాయంతో తప్పుకున్నాడు. ఆ టోర్నీలో 13.00 సగటు, 100 స్ట్రైక్‌రేట్‌తో 52 పరుగులతో అతను అతి సాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత విండీస్‌తో సిరీస్‌కు అతను ఎంపిక కాలేదు. ఈ సీజన్‌ రంజీ ట్రోఫీలో మాత్రం యువీ మెరుగ్గా రాణించాడు. 8 ఇన్నింగ్స్‌లలో 64.36 సగటుతో 672 పరుగులు సాధించాడు. ఇందులో బరోడాపై చేసిన 260 పరుగుల ఇన్నింగ్స్‌ హైలైట్‌గా నిలిచింది. దీనిని గుర్తిస్తూనే యువరాజ్‌ను ఎంపిక చేసినట్లు ఎమ్మెస్కే స్పష్టం చేశారు. మరోవైపు ఆరు నెలల క్రితం మోకాలి ఆపరేషన్‌ చేయించుకున్న నెహ్రా ఎలాంటి స్థాయిలోనూ పోటీ క్రికెట్‌ ఆడలేదు. అయితే గత ఏడాది పునరాగమనం చేసిన తర్వాత టి20ల్లో విశేషంగా రాణించిన అతడిపై సెలక్టర్లు నమ్మకముంచారు.

రహానే వన్డేలకే పరిమితం...
మరోవైపు గత కొన్నాళ్లుగా మూడు ఫార్మాట్‌లలో రెగ్యులర్‌గా జట్టులో ఉన్న కొద్ది మందిలో ఒకడైన అజింక్య రహానేపై టి20ల్లో వేటు వేసి సెలక్టర్లు హెచ్చరించారు. వన్డేల్లో మాత్రం రోహిత్‌ శర్మ ఇంకా కోలుకోకపోవడంతో రహానే స్థానానికి ముప్పు రాలేదు. అదే విధంగా గాయం నుంచి కోలుకున్నా టెస్టుల్లో అవకాశం అందుకోలేకపోయిన శిఖర్‌ ధావన్‌ వన్డేల్లోకి తిరిగొచ్చాడు. సురేశ్‌ రైనాకు కూడా టి20 టీమ్‌లోనే చోటు లభించింది. నిజానికి కివీస్‌తో వన్డే సిరీస్‌కు అతను ఎంపికైనా, అనారోగ్యంతో ఆడలేకపోయాడు. ఫలితంగా ఇప్పుడు అతని వన్డే స్థానం పోయింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ తర్వాత వన్డేల కోసం తగినంత విశ్రాంతి లభించడంతో అశ్విన్, రవీంద్ర జడేజాలాంటి సీనియర్లకు విరామం ఇవ్వలేదు. ఇంకా ఫిట్‌ కాకపోవడంతో షమీని పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు రాహుల్, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్, యజువేంద్ర చహల్, హార్దిక్‌ పాండ్యా కూడా తమ స్థానాలు నిలబెట్టుకోగా, చెన్నై టెస్టుతో దూసుకొచ్చిన కరుణ్‌ నాయర్‌కు మాత్రం నిరాశే ఎదురైంది.

ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలి...
వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టు భారత ‘ఎ’తో రెండు వన్డే వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. అందులో ఒక మ్యాచ్‌కు ధోని కూడా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, మరో మ్యాచ్‌కు రహానే కెప్టెన్‌గా ఉంటాడు. గాయాల నుంచి కోలుకొని ఈ రెండు జట్లలో ఎంపికైన ఆటగాళ్లంతా తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు ఈ మ్యాచ్‌లో ఆడే విధంగా బోర్డు అవకాశం కల్పించింది. యువరాజ్, నెహ్రా, రహానే, ధావన్‌లతో పాటు చాలా రోజులుగా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేని కారణంగా ధోని కూడా బరిలోకి దిగుతున్నాడు.

లాంఛనం పూర్తి...
భారత వన్డే, టి20 జట్ల కెప్టెన్‌గా వి రాట్‌ కోహ్లిని ఎంపిక చేసినట్లు కూడా సెలక్టర్లు ప్రకటించారు. ధోని తప్పుకోవడంతో విరాట్‌ ఎంపిక లాంఛనమే అయినా, అధికారికంగా అతడిని పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఇప్పు డే ప్రకటించారు. గతంలో కోహ్లి టీమిండియాకు 17 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో భారత్‌ 14 మ్యాచ్‌లు గెలిచి, 3 ఓడింది. ఈ మ్యాచ్‌లలో కోహ్లి 70.83 సగటుతో 850 పరుగులు చేశాడు. వీటిలో 4 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. విరాట్‌ టి20ల్లో ఒక మ్యాచ్‌కు కూడా కెప్టెన్‌గా వ్యవహరించలేదు.

సమావేశం ఆలస్యం  
సుప్రీం కోర్టు ‘తొమ్మిదేళ్ల నిబంధన’ నేపథ్యంలో సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌదరి హాజరు కావచ్చా లేదా అనే అంశంపై లోధా కమిటీ నుంచి బోర్డు స్పష్టత కోరే క్రమంలో సెలక్షన్‌ కమిటీ సమావేశం దాదాపు మూడు గంటలు ఆలస్యమైంది. చివరకు సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ఆయన కూడా అనర్హుడేనని లోధా కమిటీ తేల్చేయడంతో ఆయన లేకుండానే కమిటీ జట్టును ప్రకటించింది.  

జట్ల వివరాలు
వన్డే, టి20 రెండు జట్లలోనూ ఉన్నవారు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, ఎంఎస్‌ ధోని, యువరాజ్‌ సింగ్, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్, జడేజా, బుమ్రా, భువనేశ్వర్‌

వన్డేలకు మాత్రమే: శిఖర్‌ ధావన్, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్, రహానే, అమిత్‌ మిశ్రా, ఉమేశ్‌ యాదవ్‌

టి20లకు మాత్రమే: మన్‌దీప్‌ సింగ్, రైనా, రిషభ్‌ పంత్, చహల్, నెహ్రా.

సూపర్‌ ఫామ్‌తో...
19 ఏళ్ల రిషభ్‌ పంత్‌ ఈ సీజన్‌ రంజీల్లో చెలరేగిన తర్వాత కూడా ఆసీస్‌లో పర్యటించిన భారత ‘ఎ’ జట్టులోనూ చోటు దక్కలేదు. కానీ ఇప్పుడు నేరుగా సీనియర్‌ టీమ్‌కే అతను ఎంపికయ్యాడు. వికెట్‌ కీపర్‌ అయిన రిషభ్‌ ఈ ఏడాది రంజీల్లో 12 ఇన్నింగ్స్‌లలో 972 పరుగులతో చెలరేగాడు. ముఖ్యంగా ఒక మ్యాచ్‌లో 326 బంతుల్లో 308 పరుగులు, మరో మ్యాచ్‌లో 48 బంతుల్లో సెంచరీ చేసి తన మెరుపు బ్యాటింగ్‌ను కూడా ప్రదర్శించాడు. ఇదే అతనికి టి20 టీమ్‌లో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా చోటు కల్పించింది. ధోని మార్గనిర్దేశనంలో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా అతనికి ఎదిగే అవకాశాన్ని సెలక్టర్లు ఇచ్చారు.

‘దేశవాళీ క్రికెట్‌లో యువరాజ్‌ సింగ్‌ ఆడిన తీరును మనం అభినందించక తప్పదు. కొన్నాళ్లుగా అతను సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం లేదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ అతను డబుల్‌ సెంచరీ సాధించాడు. పైగా బౌలర్లకు విపరీతంగా అనుకూలించే లాహ్లి వికెట్‌పై 177 పరుగులు చేశాడు. కోహ్లితో చర్చించిన తర్వాతే టీమ్‌ను ఎంపిక చేశాం. మా ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది మా దృష్టిలో అత్యుత్తమ జట్టు. విజయాలైనా, వైఫల్యాలైనా సెలక్షన్‌ కమిటీ బాధ్యత వహిస్తుంది.        –ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్‌ సెలెక్టర్‌

‘నువ్వు ఎప్పటికీ నాకు కెప్టెన్‌వే’  
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనిపై విరాట్‌ కోహ్లి తన అభిమానాన్ని ప్రదర్శించాడు. ‘ఒక యువ ఆటగాడు కోరుకునే విధంగా, అతనికి అండగా నిలిచిన నాయకుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు. నాకు ఎప్పటికీ నువ్వే కెప్టెన్‌వు ధోని భాయ్‌’ అని కోహ్లి ట్వీట్‌ చేశాడు. మరోవైపు బెంగళూరు ఉదంతం జరిగిన సమయంలో అక్కడే ఉండి స్పందించనివారు అసలు మగాళ్లే కాదని కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఆ ఘటనతో నేను తీవ్రంగా కలత చెందాను. దానిని చూస్తూ ఉండిపోవడం పశుప్రవృత్తికి సంకేతం. మీ కుటుంబంలో ఎవరికైనా అలా జరిగితే స్పందించకుండా ఉంటారా? ఇలాంటి సమాజంలో భాగమైనందుకు నేను సిగ్గు పడుతున్నా. మహిళలను గౌరవించడం నేర్చుకోండి’ అని అతను వ్యాఖ్యానించాడు. 

మరిన్ని వార్తలు