అందుకు ఎన్సీఏనే కారణం: యువీ

21 Jul, 2018 16:39 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా రెగ్యులర్‌ టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా వచ్చే నెల్లో లండన్‌కు వెళ్లి తన భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చాక బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాస కార్యక్రమంలో పాల్గొనున్నాడు. దీనిలో భాగంగా జాతీయ క్రికెట్‌ అకాడమీలోని ఆటగాళ్లకు ఏర్పాటు చేసిన సదుపాయాలపై విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. గాయాలు పాలైన క్రికెటర్లు తిరిగి పునరాగమనం చేయడానికి బీసీసీఐ జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.

‘గాయాలు బారిన పడిన టీమిండియా క్రికెటర్లు కోలుకునేందుకు జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్న మౌలిక సదుపాయాలు ఎంతగానో దోహదం చేస్తాయి. నేను క్యాన‍్సర్‌ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవడానికి సదరు అకాడమీలో బీసీసీఐ ఏర్పాటు చేసిన సదుపాయాలే ముఖ్య కారణం. క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న తర్వాత ఎన్సీఏ పునరావాస కార్యక్రమంలో పాల్గొనడం నాకు లాభించింది. అక్కడ చాలా గొప్ప సదుపాయాల్ని బీసీసీఐ ఏర్పాటు చేసింది. దేశంలోనే అత్యంత అనుభవమన్న ఫిజియోలు, ట్రైనర్స్‌ మన జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్నారు’ అని యువీ తన అనుభవాన్ని షేర్‌ చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు