క్రికెట్‌ ఎంత ఇష్టమో.. అంత అయిష్టం: యువీ

10 Jun, 2019 17:31 IST|Sakshi

ముంబై : క్రికెట్‌ తనకు ఎంత ఇష్టమో అంతే అయిష్టమని టీమిండియా తాజా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. నిలకడలేమి ఆటతో జట్టుకు దూరమైన యువీ అనూహ్యంగా సోమవారం వీడ్కోలు పలికాడు. ముంబైలోని ఓ హోటల్‌లో మీడియాతో సమావేశమైన యువీ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అయితే మీడియా సమావేశంలో యువీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘క్రికెట్‌తో నేను చాలా నేర్చుకున్నాను. జీవితంలో ఎలా పోరాడాలో ఆటనే నేర్పింది. అందుకే నాకు క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. అయితే చాలా సమయాల్లో మానసికంగా చాలా ఒత్తిడికి గురిచేసింది. అందుకే అయిష్టం(నవ్వుతూ). నా తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ నాకు తొలి గురువు. మా ఇద్దరి రిలేషన్‌ షిప్‌ చాలా వెరైటీగా ఉండేది. పదేళ్ల వయసులోనే 16 ఏళ్ల పిల్లవాడిలా పరిగెత్తించేవాడు. కష్ట సమయాల్లో నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు’అంటూ యువీ భావోద్వేగానికి గురయ్యాడు.  

యువీ ఆటను చూస్తే వారు గుర్తొచ్చేవారు..
యువరాజ్‌ సింగ్‌ ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం అతడి తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘యువరాజ్‌ ఆటను చూస్తే నాకు గ్యారీఫీల్డ్‌ సొబెర్స్‌, వీవీ రిచర్డ్స్‌లు గుర్తొచ్చేవారు. కచ్చితమైన షాట్లు, టైమింగ్‌తో యువీ ఎన్నో సార్లు నన్ను ఆశ్చర్యపరిచాడు. భవిష్యత్‌లో యువీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అని పేర్కొన్నాడు. ఇక యోగ్‌రాజ్‌ కూడా క్రికెటరే అన్న విషయం తెలిసిందే. టీమిండియా తరుపున అతడు ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడాడు.

చదవండి: 
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్‌ సింగ్‌
‘క్రికెట్‌లో ఒక శకం ముగిసింది’

>
మరిన్ని వార్తలు