గతేడాదే ఫిక్స్‌ అయ్యా.. ఇదే చివరిదని: యువీ

10 Jun, 2019 20:20 IST|Sakshi

ముంబై : ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టువార్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన క్షణాలు ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. టీమిండియా రెండో సారి ప్రపంచకప్‌ గెలవడంలో అతడు పడిన శ్రమ ఇంకా ఎవరూ మర్చిపోలేదు. కేన్సర్‌ మహమ్మారిని జయించి తిరిగి కొత్త క్రీడా జీవితం ప్రారంభించాలనుకున్న అతడికి ఏదీ కలసిరాలేదు. దీంతో కొంతకాలం నిరీక్షించాడు.. అలసిపోయాడు.. అవమానపడ్డాడు. చివరికి తనకు ప్రాణమైన క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు టీమిండియా లెజెండ్‌ యువరాజ్‌ సింగ్‌. ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిటైర్మెంట్‌ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. 

నా కల ఘనంగా నెరవేరింది..
‘క్రికెట్‌ కోసం తన రక్తం, స్వేదం ధారపోశాను. క్యాన్సర్‌ బాధితులకు సాయం అందించడమే నా తదుపరి లక్ష్యం. జీవితంలో ఏ విధంగా పోరాడాలో క్రికెటే నేర్పింది. జీవితంలో నేను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. క్రికెట్‌ ఆడటం.. తనకు పోరాడటం, పడటం.. లేవడం ముందుకు సాగడం నేర్పింది. 18 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాను, 40 టెస్టులు, 304 వన్డేలు ఆడాను. ప్రపంచకప్ గెలవడం నా కల, అది ఘనంగా నెరవేరింది.


కాస్త అసంతృప్తిగానే..
నా కెరీర్‌ను ఎలా ముగించాలనే కన్ఫ్యూజన్‌లో ఉండేవాడిని. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇంకా ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఉంటే నాకు ఇంకాస్త సంతృప్తిగా ఉండేది. ఆ సంతృప్తితో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేవాడిని. అయితే జీవితంలో అనుకున్నవన్నీ జరగవు కదా. 2019 ఐపీఎలే నాకు చివరిది అని గతేడాదే నిర్ణయించుకున్నా. ఇకపై ఐపీఎల్‌కు నేను అందుబాటులో ఉండను. బీసీసీఐ, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నా.
(చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్‌ సింగ్‌)

బీసీసీఐ అనుమతిస్తే..
బీసీసీఐ నుంచి అనుమతి లభిస్తే విదేశాల్లో టీ20 లీగుల్లో ఆడేందుకు ఎదురు చూస్తున్నా. ఈ వయసులో ఎంజాయ్‌ చేస్తూ ఆడే టోర్నీల్లో అయితేనే ఆడగలను అనిపిస్తుంది. అంతర్జాతీయ కెరీర్‌ గురించి ఆలోచించుకుంటూ ఐపీఎల్‌ లాంటి పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడటం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్నది. అందుకే బీసీసీఐ అనుమతితో విదేశాల్లో టీ20 లీగ్‌లు ఆడాలని ఉంది’ అంటూ యువీ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.

యువీకి కలిసిరాని ఐపీఎల్‌
ఐపీఎల్‌తో అనామక క్రికెటర్లు రాత్రికిరాత్రే స్టార్లు అయినవారు ఉన్నారు. కానీ ఐపీఎల్‌ ప్రారంభానికే ముందే టీ20ల్లో టీమిండియా స్టార్‌ అయిన యువీ ఈ రిచ్‌లీగ్‌ టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం 132 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్‌ స్టైలీష్‌ బ్యాట్స్‌మన్‌ 2,750 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఈ టోర్నీలో నిలకడలేమితో అనేక జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, పుణె వారియర్స్‌కు సారథిగా, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లలో ఆటగాడిగా ఆడాడు. 2015 ఐపీఎల్‌ సీజన్‌లో దిల్లీ జట్టు యువరాజ్‌ను రికార్డు స్థాయిలో రూ. 16కోట్లకు సొంతం చేసుకోగా పూర్‌ ఫామ్‌ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు ముంబయి ఇండియన్స్‌ యువీని కేవలం రూ. కోటి ప్రారంభ ధరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అతడు కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 98 పరుగులు చేశాడు. అందులో ఒక అర్ధశతకం ఉంది.
చదవండి:
క్రికెట్‌ ఎంత ఇష్టమో.. అంత అయిష్టం
యువీ హార్ట్‌ టచింగ్‌ వీడియో.. వైరల్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా