కోహ్లి కెప్టెన్సీపై యువీ కూడా..

27 Sep, 2019 12:22 IST|Sakshi

ముంబై : ఇంగ్లండ్‌ వేదికగా ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం విరాట్‌ కోహ్లి సారథ్యంపై పలు ప్రశ్నలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సారథిగా కోహ్లి అన్‌ఫిట్‌ అంటూ కొందరు బహిరంగంగా విమర్శించారు. మరికొందరు కోహ్లి కెప్టెన్సీని కేవలం టెస్టులకే పరిమితం చేయాలని సూచించారు. అయితే వెస్టిండీస్‌ పర్యటనలో టీమిండియా అదరగొట్టడంతో.. కోహ్లికి కాస్త ఉపశమనం లభించింది అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో కోహ్లి సారథ్యంలోని టీమిండియా మరోసారి నిరుత్సాహపరిచింది. దీంతో కోహ్లి కెప్టెన్సీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ కోహ్లి కెప్టెన్సీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లికి వర్క్‌లోడ్‌ ఎక్కువైందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తే కెప్టెన్సీ నుంచి తప్పిస్తే బెటర్‌ అని అభిప్రాయపడ్డాడు. 

‘విరాట్‌ కోహ్లి బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అతడికి వర్క్‌లోడ్‌ ఎక్కువైందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తే.. కేవలం టెస్టు సారథ్య బాధ్యతలకు పరిమితం చేయాలి. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సారథిగా రోహిత్‌ శర్మను నియమిస్తే బెటర్‌. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ సారథ్యంలోనే అనేక విజయాలను అందుకుంది. అతడిపై పూర్తి విశ్వాసం ఉంది. కెప్టెన్‌గా విజయవంతం అవుతాడనే నమ్మకం ఉంది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వంటి ఆగ్రశ్రేణి జట్లు కూడా మూడు ఫార్మట్లకు ఒక్కరినే కెప్టెన్‌గా నియమించడంలేదు. దీనిపై మేనేజ్‌మెంట్‌ ఆలోచించాలి. అయితే అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి.. కోహ్లి సారథిగా విఫలమయ్యాడని అనుకుంటే పొరపాటే. కేవలం వర్క్‌లోడ్‌ ఎక్కువైందనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశాను. 

రోహిత్‌ శర్మను టెస్టుల్లో ఓపెనర్‌గా ఎప్పుడు ప్రయోగించాల్సింది. ఆలస్యం చేశారు. అయితే ఒకటి, రెండు టెస్టులతో ఓ ఆటగాడిపై అంచనా వేయలేం. కనీసం పది టెస్టులైన ఆడే అవకాశం ఇవ్వాలి. ఆలా అయితే ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం దక్కుతుంది. అప్పుడు ఆటగాడి సత్తా ఏంటో తెలుస్తుంది. రోహిత్‌కు కూడా కనీసం 6 టెస్టులైనా ఆడే అవకాశం ఇవ్వాలి. అప్పుడే రోహిత్‌ టెస్టు ప్రతిభ బయటపడుతుంది. ఇక కేఎల్‌ రాహుల్‌కు అనేక అవకాశాలు దక్కాయి. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. మంచి ప్రతిభ గల ప్లేయర్‌. త్వరలోనే తిరిగి టీమిండియాలోకి వచ్చి చేరుతాడని ఆశిస్తున్నా’అంటూ యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు.  

Poll
Loading...
మరిన్ని వార్తలు