బిన్నీని తెస్తేనే నయం!

21 Jan, 2014 01:05 IST|Sakshi
బిన్నీని తెస్తేనే నయం!

హామిల్టన్: భారత్ వన్డేలో నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశమే లేదు. ‘నలుగురు పేసర్లతో ఆడితే మాకు రెండు ఫలితాలు వస్తాయి. ఒకటి కెప్టెన్‌పై నిషేధం, రెండు ఓటమి’ న్యూజిలాండ్‌తో తొలి వన్డే తర్వాత ధోని వ్యాఖ్య ఇది. నలుగురు పేసర్లతో ఆడటంవల్ల స్లో ఓవర్ రేట్ అనేది భారత్‌కు పెద్ద సమస్య. కాబట్టి ఈ ఆప్షన్‌ను ధోని కొట్టిపారేశాడు. కానీ కివీస్‌లో వికెట్ల స్వభావం దృష్ట్యా ఇద్దరు స్పిన్నర్లు (అశ్విన్, జడేజా)తో ఆడే వ్యూహం బెడిసికొట్టొచ్చు.

 ముఖ్యంగా రవీంద్ర జడేజా ఓ రకంగా జట్టుకు భారంగానే మారాడని అనుకోవాలి. కేవలం బౌలర్‌గా జట్టులో ఉంటే సరే... కానీ ఆల్‌రౌండర్ కోటాలో ఆడుతున్న జడేజా బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. గతేడాది చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ ఆల్‌రౌండర్ ఎక్కడా బంతితోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. బ్యాట్స్‌మెన్‌గా ఎలాగూ పనికి రావడం లేదు. తొలి వన్డేలో జడేజా కనీసం పది నిమిషాలు క్రీజులో నిలబడి కోహ్లికి సహకరిస్తే ఫలితం మరోలా ఉండేది.

 రేపు ప్రపంచకప్‌లోనూ ఇవే వికెట్లు కాబట్టి... భారత్ ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకోవడం మేలు. అదనంగా బ్యాట్స్‌మన్ కావాలంటే రాయుడు ఉన్నాడు. ఆల్‌రౌండరే కావాలంటే పేస్ ఆల్‌రౌండర్‌గా స్టువర్ట్ బిన్నీ అందుబాటులో ఉన్నాడు. కాబట్టి  సిరీస్‌లో వీలైనంత తొందరగా బిన్నీని ఆడించడం మేలు.  రేపు (బుధవారం) జరిగే రెండో వన్డేలో ధోని ఈ ప్రయోగం చేస్తాడా..? లేక జడేజాకే కట్టుబడతాడా అనేది  ఆసక్తికరం.

 సిరీస్‌కు మిల్నే దూరం!
 పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. తొలి వన్డేలో గాయపడ్డ మిల్నేకు ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

>
మరిన్ని వార్తలు