‘యువీని తీసుకున్నందుకు చాలా సంతోషం’

21 Dec, 2018 20:07 IST|Sakshi

కోల్‌కతా: ఇటీవల జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) వేలంలో టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను తొలి రౌండ్‌లో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరచలేదు. అయితే రెండో రౌండ్‌లో  ముంబై ఇండియన్స్‌ రూ.కోటి కనీస ధరకే అతడిని తీసుకుంది. తాము యువీ, మలింగ కోసం ఎక్కువ బడ్జెట్‌ కేటాయించామని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ప్రకటించింది. అత్యంత అనుభవమున్న వీరు తక్కువ ధరకే దొరకడం అదృష్టమని వెల్లడించింది. కాగా, యువరాజ్‌ సింగ్‌ను ముంబై ఇండియన్స్‌ దక్కించుకోవడంపై మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్పందించాడు.

‘యువరాజ్‌ సింగ్‌ను ముంబై ఇండియన్స్‌ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దేశం తరఫున అతడు అత్యుత్తమ ఆటగాడు. యువీకి అభినందనలు’ అని ట్వీట్‌ చేశాడు. యువీ తన కనీస ధరను రూ.2 కోట్ల నుంచి ఈ సారి కోటికి తగ్గించుకున్నాడు. గతేడాది కింగ్స్‌ పంజాబ్‌కు ఆడిన అతడు 8 మ్యాచ్‌ల్లో 65 పరుగులు చేశాడు. దాంతో అతడిని కింగ్స్‌ పంజాబ్‌ వదిలేసింది. ఈ నేపథ్యంలో రాబోయే ఐపీఎల్‌లో యువీ ఆడటంపై తొలుత అనుమానాలు నెలకొన్నాయి. చివరకు ముంబై ఇండియన్స్‌ తీసుకోవడంతో యువీ మరొకసారి ఐపీఎల్‌ ఆడటం ఖాయమైంది.

మరిన్ని వార్తలు