‘హర్భజన్‌.. నీకు మాత్రం ఈజీ కాదు’

15 May, 2020 10:01 IST|Sakshi
యువరాజ్‌ సింగ్‌(ఫైల్‌ఫొటో)

యువరాజ్‌ సింగ్‌ నయా చాలెంజ్‌

సచిన్‌, రోహిత్‌, భజ్జీలకు సవాల్‌

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉండే భారత క్రికెటర్లలో ఒకడైన యువరాజ్‌ సింగ్‌   నయా వీడియో చాలెంజ్‌తో ముందుకొచ్చాడు ‘కీప్‌ ఇట్‌ అప్‌’ చాలెంజ్‌ పేరుతో బ్యాట్‌ను అడ్డంగా తిప్పి బంతిని కొడుతూ కొత్త చాలెంజ్‌కు శ్రీకారం చుట్టాడు. ఇలా బంతిని కింద పడకుండా పలుమార్లు కొట్టిన యువీ.. ఈ చాలెంజ్‌ను మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, రోహిత్‌ శర్మ, హర్భజన్‌ సింగ్‌లను నామినేట్‌ చేశాడు. అయితే ఈ చాలెంజ్‌ అంత ఈజీ కాదని అంటున్నాడు యువీ. ప్రత్యేకంగా హర్భజన్‌ సింగ్‌కు ఇది సవాల్‌ అని పేర్కొన్నాడు. ఇక సచిన్‌ టెండూల‍్కర్‌కు ఈ చాలెంజ్‌ ఈజీ అని, రోహిత్‌ శర్మకు కూడా ఈజీ కావొచ్చని అంటున్నాడు. కానీ భజ్జీకి ఇది ఎంతమాత్రం ఈజీ కాదన్నాడు. ఇటీవల రోహిత్‌ శర్మ-యువరాజ్‌ సింగ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలోనే రోహిత్‌ను అనేక ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు యువీ. రోహిత్‌ కెరీర్‌కు సంబంధించి కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుని మరీ యువీ ఆట పట్టించాడు. వీటిలో కొన్నింటికి రోహిత్‌ సమాధానం చెప్పినా, ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయాడు. అదే సమయంలో యువీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ముచ్చటలను కూడా రోహిత్‌ ప్రస్తావించాడు. ('నా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు')

ఇదిలా ఉంచితే, కొన్ని రోజుల క్రితం ఆసీస్‌ ఓపెనర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌తో కూడా రోహిత్‌ పలు విషయాల్ని షేర్‌ చేసుకున్నాడు. అయితే టీమిండియా ఓపెనర్లలో ఒకడైన శిఖర్‌ ధావన్‌ గురించి చర్చించడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. తనతో ఓపెనింగ్‌ భాగస్వామ్యం చేసే క్రమంలో ధావన్‌ ఎలా ఉండేవాడో రోహిత్‌ చెప్పుకొచ్చాడు. తాను ఓపెనర్‌గా ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన క్రమంలో పలు సమస్యలను ఎదుర్కొన్నానని రోహిత్‌ తెలిపాడు. తొలి బంతిని కానీ మొదటి ఓవర్‌ను కానీ ధావన్‌ ఆడటానికి ఇష్టపడేవాడు కాదన్నాడు. ఈ విషయాన్ని వార‍్నర్‌ కూడా అంగీకరించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ధావన్‌ ఆడిన క్రమంలో తనతో కూడా ఇలానే ఉండేవాడు అనే విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. కాగా, ఇది ధావన్‌లో అసంతృప్తిని తీసుకొచ్చింది. దీనిపై టీమిండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో ధావన్‌ అసహనం వ్యక్తం చేశాడు. తాను ఎనిమిదేళ్లుగా ఓపెనర్‌గా ఆడుతున్నానని స్పష్టం చేశాడు. ఒకవేళ ఓపెనింగ్‌ ఇష్టం లేకపోతే ఓపెనర్‌గా ఎందుకు దిగుతానని పేర్కొన్నాడు. ఒకవేళ తొలి ఓవర్‌ను ఆడకపోయినా రెండో ఓవర్‌ను అయినా ఆడాలి కదా అని రోహిత్‌, వార్నర్‌లకు చురకలంటించాడు. (సచిన్‌కు ‘స్పార్టన్‌’ క్షమాపణలు)

ఇక్కడ చదవండి: బాస్‌.. నాకు ఓపెనింగ్‌  కొత్త కాదు

మరిన్ని వార్తలు