క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్‌ సింగ్‌

10 Jun, 2019 13:53 IST|Sakshi

ముంబై : సిక్సర్ల సింగ్‌, టీమిండియా క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. నిలకడలేమి ఆటతో జట్టుకు దూరమైన యువీ అనూహ్యంగా సోమవారం వీడ్కోలు పలికాడు. ముంబైలోని ఓ హోటల్‌లో మీడియాతో సమావేశమైన యువీ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని లాంఛనంగా ప్రకటించాడు. దాదాపు 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, జీవితంలో ఏ విధంగా పోరాడాలో ఆటనే నేర్పిందని యువరాజ్‌ భావోద్వేగానికి గురయ్యాడు.

మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలో భారత్‌ సాధించిన రెండు ప్రపంచకప్‌ల్లో యువీ కీలక పాత్రపోషించాడు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌లో బ్యాట్‌తో బంతితో మెరిసి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అందుకున్నాడు.  ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్‌ ఉందని తెలిసినా ఆటకే ప్రాధాన్యత ఇచ్చిన యువీ.. ప్రపంచకప్‌ అనంతరం అమెరికా వెళ్లి చికిత్స చేసుకున్నాడు. ఈ చికిత్స అనంతరం యువీ కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం.. యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎదురు కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. 


1996లో అండర్-15 వరల్డ్ కప్, 2000 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్, 2007,2011 ప్రపంచకప్‌ల్లో యువరాజ్‌ సింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టి నయా ట్రెండ్‌ సృష్టించాడు. మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యువీ 1900 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

వన్డే కెరీర్‌లో 304 మ్యాచ్‌ల్లో 14 సెంచరీలు, 52 హాఫ్‌ సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ 8 ఆఫ్‌ సెంచరీలతో 1177 పరుగులు నమోదు చేశాడు. రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్, ఐర్లాండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. 2000లో కెన్యాపై అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఈ సిక్సర్ల కింగ్‌.. చివరి వన్డేను 2017 వెస్టిండీస్‌తో ఆడాడు.  2003లో టెస్టుల్లో న్యూజిలాండ్‌తో అరంగేట్రం చేసిన యువీ 2012లో ఇంగ్లండ్‌పై తన చివరి టెస్ట్‌ను ఆడగా, ఇక చివరి అంతర్జాతీయ టీ20 ఇంగ్లండ్‌పై 2017లో ఆడాడు. ఐపీఎల్-12లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా.. పెద్దగా ఆకట్టుకోలేదు.

మరిన్ని వార్తలు