యువరాజ్‌ గుడ్‌బై

11 Jun, 2019 04:39 IST|Sakshi
మీడియా సమావేశంలో భార్య హేజల్‌ కీచ్, తల్లి షబ్నమ్‌తో యువీ

రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌

అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కూ బైబై

విదేశీ టి20 లీగ్‌లపై ఆసక్తి   

ముంబై: భారత వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న యువరాజ్‌ సింగ్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు అతను వెల్లడించాడు. సోమ వారం జరిగిన మీడియా సమావేశంలో తన రిటైర్మెంట్‌ గురించి ప్రకటన చేసిన 37 ఏళ్ల యువీ... ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్, భవిష్యత్తు తదితర అంశాలపై వివరంగా మాట్లాడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆఖరి సారిగా ప్రాతినిధ్యం వహించిన యువరాజ్‌... జాతీయ జట్టు తరఫున రెండేళ్ల క్రితం 2017 జూన్‌లో ఆఖరి వన్డే ఆడాడు.

17 ఏళ్ల అంతర్జా తీయ కెరీర్‌లో యువీ మూడు ఫార్మాట్‌లలో కలిపి 402 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. భారత జట్టులోకి పునరాగమనం చేసే అవకాశాలు దాదాపుగా లేకపోవడం, ఐపీఎల్‌లో కూడా అతనిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించకపోవడంతో ఇక తప్పుకోవడమే సరైనదిగా యువీ భావించాడు. 25 ఏళ్ల పాటు 22 గజాల క్రికెట్‌ పిచ్‌తో అనుబంధం కొనసాగించిన తర్వాత ఆటకు ముగింపు పలికేందుకు ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు యువరాజ్‌ చెప్పాడు. అయితే రిటైర్మెంట్‌ అనంతరం బీసీసీఐ అనుమతిస్తే ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు టి20 లీగ్‌లు ఆడాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను వెల్లడించాడు. మీడియా సమావేశంలో యువరాజ్‌ వెంట అతని తల్లి షబ్నమ్, భార్య హాజల్‌ కీచ్‌ ఉన్నారు.  

భారత్‌ తరఫున 400కు పైగా మ్యాచ్‌లు ఆడగలగడం నా అదృష్టం. నా కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుందని ఏనాడూ ఊహించలేదు. పడ్డ ప్రతీసారి పైకి లేవడం ఎలాగో నాకు క్రికెట్‌ నేర్పించింది. విజయాలకంటే అపజయాలు నన్ను ఎక్కువగా పలకరించినా నేనెప్పుడూ ఓటమిని ఒప్పుకోలేదు. దేశం కోసం ఆడే సమయంలో నేను ఉద్వేగంతో ఉప్పొంగి పోయేవాడిని. జట్టు కోసం నేను చేసిన ప్రతీ పరుగు, తీసిన వికెట్, ఆపిన పరుగులు అన్నీ గొప్పగానే అనిపిస్తాయి. 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో భాగమయ్యాను. అంతకు మించి ఇంకేం కావాలి.

ఎలా రిటైర్‌ కావాలనే విషయంలో కొంత సందిగ్ధత నన్ను వెంటాడింది. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడి టైటిల్‌ గెలిచాక రిటైర్‌ అయితే సంతృప్తిగా ఉంటుందని భావించా. అయితే తుది జట్టులో నాకు చోటు దక్కలేదు. జీవితంలో అన్నీ అనుకున్నట్లు జరగవు. సంవత్సరం క్రితమే ఈ ఏడాది ఐపీఎల్‌ తర్వాత తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇక ఆడింది చాలు అనిపించిన సమయం వచ్చేసింది. రిటైర్‌ అవడానికి ముందు సచిన్‌ సలహా తీసుకోవడంతో పాటు సహచరులు జహీర్, భజ్జీ, వీరూలకు చెప్పా. చాలా కాలం తర్వాత నాన్నతో కూడా సుదీర్ఘంగా మాట్లాడి నా నిర్ణయాన్ని చెప్పాను. ఇకపై ఆటను ఆస్వాదించేందుకే బయటి లీగ్‌లలో పాల్గొనాలనుకుంటున్నా.                                      
–యువరాజ్‌

► 10 వేల పరుగులు పూర్తి చేయలేదనే బాధ ఏమాత్రం లేదు. దాని గురించి అసలు ఎప్పుడూ ఆలోచించనే లేదు. నాకు ప్రపంచ కప్‌ గెలవడం అనేది కల. నా దృష్టిలో 10 వేలకంటే ప్రపంచ కప్‌ గెలుపే మిన్న.

► నాలుగు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌లు, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు, 28 ఏళ్ల తర్వాత భారత్‌ ప్రపంచకప్‌ గెలవడం... నిస్సందేహంగా ఇంతకంటే మధుర క్షణం నా కెరీర్‌లోనే లేదు. శ్రీలంకపై 2014 టి20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ అత్యంత బాధాకర సమయం. నా కెరీర్‌ అప్పుడే ముగిసిపోయిందని భావించా. నా పనైపోయిందని అందరూ నన్ను తేలిగ్గా తీసిపారేసిన క్షణమది.

► టెస్టుల్లో రాణించలేకపోయాననే నిరాశ మాత్రం ఉంది. నాటి దిగ్గజాల వరుసలో నాకు జట్టులో స్థానం దక్కడమే కష్టంగా ఉండేది. ఒక్క మ్యాచ్‌ ఆడి విఫలం కాగానే చోటు పోయేది. నేను చేయగలిగినదంతా చేశాను. మరో 40 టెస్టులైనా ఆడగలిగితే బాగుండేదేమో. టెస్టుల్లో సగటు కూడా కనీసం 40 ఉండాలని కోరుకున్నా సాధ్యం కాలేదు.

►  నా తొలి కెప్టెన్‌ గంగూలీ చాలా అండగా నిలిచాడు. తన ఆటగాళ్ల కోసం అతను ఎప్పుడూ పోరాడేందుకు సిద్ధంగా ఉంటాడు. ధోనితో కలిసి ఎన్నో విజయాలు సాధించాం కాబట్టి అతని ప్రభావం కూడా నాపై చాలా ఉంది.

►  ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్‌ల బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో నేను ఎక్కువగా ఇబ్బంది పడ్డాను. విదేశీ ఆటగాళ్లలో బ్యాట్స్‌మన్‌గా పాంటింగ్‌ను అభిమానిస్తా.

► వివాదాస్పద అంశాల గురించి మాట్లాడేందుకు మున్ముందు చాలా సమయం ఉంది. ఇప్పుడు మన ఆటగాళ్లు ప్రపంచకప్‌ ఆడుతున్న సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు.
 
‘ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ వద్దన్నా’...
నాకు ఆఖరిసారిగా ఒక మ్యాచ్‌ ఆడే అవకాశం ఇవ్వమని బీసీసీఐలో ఎవరినీ అడగలేదు. ఆఖరి మ్యాచ్‌ అంటూ క్రికెట్‌ ఆడటం నాకు నచ్చదు. గతంలో ఒకసారి నేను యో యో టెస్టులో విఫలమైతే రిటైర్మెంట్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేస్తామని నాతో చెప్పారు. అయితే నాకు అవసరం లేదన్నాను. యో యో టెస్టులో విఫలమైతే నేరుగా ఇంటికే వెళ్లిపోతానని చెప్పా. ఆ తర్వాత యో యో టెస్టు పాస్‌ అయి మిగతా విషయాలు వారికే వదిలేశా.

>
మరిన్ని వార్తలు