మళ్లీ బ్యాట్‌ పట్టనున్న యువరాజ్‌

21 Jun, 2019 17:02 IST|Sakshi
యువరాజ్‌ సింగ్‌(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్‌కు గుడ్‌ బై చెప్పిన యువరాజ్‌ సింగ్‌ మళ్లీ బ్యాట్‌ పట్టనున్నాడు. విదేశీ లీగ్‌లో భాగంగా కెనడాలో జరుగనున్న గ్లోబల్‌ టీ20 టోర్నీలో యువీ ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు టోరంటో నేషనల్స్‌ జట్టు తరఫున ఆడేందుకు యువీ సంతకం చేశాడు. ఇందుకు ఇప్పటికే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో యువీ కెనడా లీగ్‌లో ఆడటం ఖాయమైంది. ఈ టోర్నీ జూలై 25వ తేదీన ఆరంభం కానుంది. ఆరు జట్లు తలపడుతున్న ఈ లీగ్‌లో 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

ఇప్పటికే కెనడా లీగ్‌లో బ్రెండన్‌ మెకల్లమ్‌, క్రిస్‌ గేల్‌, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌, క్రిస్‌ లిన్‌, డ్వేన్‌ బ్రేవో, కేన్‌ విలియమ్సన్‌, డుప్లెసిస్‌, షాహిద్‌ అఫ్రిది, డారెన్‌ సామీ, షకీబుల్‌ హసన్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే. కాగా, వీరిలో మెకల్లమ్‌ మాత్రమే టోరంటో నేషనల్స్‌ తరఫున ఆడుతుండగా మిగతా వారు వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన యువరాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విదేశీ  లీగ్‌లో ఆడతానని తన రిటైర్మెంట్‌ సమయంలోనే స్పష్టం చేశాడు. దానిలో భాగంగానే ముందుగా కెనడా టీ20 లీగ్‌లో ఆడేందుకు ఒప‍్పందం చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు