అదొక చెత్త ప్లానింగ్‌: యువరాజ్‌ సింగ్‌

18 Dec, 2019 15:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా నాకౌట్‌ దశలోనే నిష్క్రమించడానికి మేనేజ్‌మెంట్‌ తీసుకున్న చెత్త నిర్ణయాలే కారణమని మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ధ్వజమెత్తాడు. ఆ మెగా టోర్నీలో సరైన ప్రణాళికలు లేకుండా బరిలోకి దిగడంతోనే టోర్నీని సెమీస్‌లోనే ముగించాల్సి వచ్చిందంటూ విమర్శించాడు. ప్రధానంగా ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు. అదే సమయంలో విజయ్‌ శంకర్‌కు గాయమైతే స్టాండ్‌ బైగా ఉన్న రిషభ్‌ పంత్‌ను జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయం కాదన్నాడు. అనుభవం ఉన్న అంబటి రాయుడ్ని కాదని రిషభ్‌ను తీసుకోవడం మేనేజ్‌మెంట్‌ చేసిన అతి పెద్ద తప్పిదమన్నాడు. వరల్డ్‌కప్‌కు ఒక కలగూరగంపలా జట్టు ఎంపిక జరిగిందంటూ మండిపడ్డాడు.

‘ఆ టోర్నీ మన నంబర్‌-4 ఆటగాడి అత్యధిక స్కోరు 48. ఇది నిజంగా పేలవమైన ప్రదర్శన కాకపోతే ఏమిటి. మన మేనేజ్‌మెంట్‌ కేవలం రోహిత్‌-కోహ్లిలు ఫామ్‌లో ఉన్నారనే ఉద్దేశంతోనే అలా ఎంపిక చేసినట్లు ఉన్నారు. ఇక్కడ మ్యాచ్‌లు గెలవడంపై దృష్టి పెట్టలేదు. అంబటి రాయుడ్ని కాదని పంత్‌ను తీసుకోవడమే అందుకు నిదర్శనం. విజయ్‌ శంకర్‌, పంత్‌లకు అప్పటికి ఐదు వన్డేల ఆడిన అనుభవం మాత్రమే ఉంది. మెగా టోర్నీలకు ఇలానే సిద్ధమవుతారా..  మన మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలే జట్టు సెమీస్‌లు నిష్క్రమించడానికి కారణం’ అని యువరాజ్‌ విమర్శించాడు.

మరిన్ని వార్తలు